Samantha: చేతిలో వెయ్యి కోట్ల సినిమాలేం లేవు.. అయినా చాలా ఆనందంగా ఉన్నా
Samantha: ప్రముఖ అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు తన జీవితంలో మయోసైటిస్‌తో చేసిన పోరాటం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని వెల్లడించారు. గతంలో విజయం అంటే కేవలం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌లను సాధించడం, వరుసగా సినిమాలు చేయడం మాత్రమే అని నమ్మేదాన్నని, అయితే అనారోగ్యం తర్వాత తన అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.
‘‘కొన్నేళ్ల క్రితం, ఒక సంవత్సరంలో నేను నటించిన ఐదు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అది విజయానికి నిర్వచనంగా భావించాను. టాప్ 10 నటీనటుల జాబితాలో ఉండటం, వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడమే నా లక్ష్యంగా ఉండేది. కానీ, గత రెండేళ్లుగా నా సినిమాలు పెద్దగా విడుదల కాలేదు. నేను టాప్ 10 లిస్ట్‌లో కూడా లేను. అయినా నేను ఇప్పుడు ఉన్నంతలో సంతోషంగానే ఉన్నాను’’ అని సమంత వెల్లడించారు.
గతంలో ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ నంబర్లు, క్యాలిక్యులేషన్స్‌తో తన ఆత్మగౌరవాన్ని పోల్చుకునేదాన్నని, అయితే ప్రస్తుతం ఆ ఆలోచనలు లేవని సమంత స్పష్టం చేశారు. “ఇండస్ట్రీలో రేపు ఎవరో నా స్థానాన్ని భర్తీ చేస్తారేమో అనే భయం ఉండేది. ఇప్పుడు ఆ ఆందోళన లేదు. నా ఫాలోవర్స్ చాలామంది నా గ్లామర్, సినిమాల వల్లే నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. అయినా, వారికోసం నేను ఏడాది నుంచి హెల్త్ పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నాను. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ఎక్కడా వెతకాల్సిన అవసరం లేకుండా ఒకే చోట లభించేలా చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా” అని ఆమె వివరించారు.
ప్రస్తుతం సమంత, ప్రముఖ దర్శకులు రాజ్, డీకే తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత సమంత తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్న తీరు ఆమె అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది.