Samantha Raj: ఒకే కారులో సమంత – రాజ్.. మళ్లీ దొరికేసిన లవ్ బర్డ్స్
Samantha Raj: తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే నటి సమంత రూత్ ప్రభు కెరీర్, వ్యక్తిగత జీవితం నిరంతరం చర్చనీయాంశమవుతూ ఉంటాయి. గతంలో అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన ఆమె, నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. ఇటీవల ఆమె నిర్మించిన ‘శుభం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
అయితే సమంత కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్ తెరకెక్కించిన డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో తరచూ కనిపిస్తుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడం, కలిసి పర్యటించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
కలిసి తిరిగిన దృశ్యాలు.. వైరల్‌గా మారిన ఫొటోలు
ఇటీవల సమంత భుజంపై రాజ్ చేయి వేసి నడుస్తున్న ఫోటోలు, ఇద్దరు పక్కపక్కన కూర్చుని సంతోషంగా కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, తాజాగా ఈ జంట ఒకే కారులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. సమంత క్యాజువల్ వైట్ డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తుండగా, వీరిద్దరూ ఒకే కారులో తిరిగి వెళ్లడం మీడియా కెమెరాలకు చిక్కింది. ఈ దృశ్యాలు బయటికొచ్చినప్పటి నుంచి వీరి బంధంపై చర్చ మరింత ముదిరింది.
వృత్తిపరమైన పరిచయం… వ్యక్తిగత బంధంగా?
రాజ్ నిడిమోరు, డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి వెబ్ సిరీస్‌లలో సమంత నటించారు. ఈ ప్రాజెక్టుల సమయంలోనే రాజ్ నిడిమోరుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. షూటింగ్ సమయంలో ఏర్పడిన ఈ పరిచయం ప్రేమగా మారిందని, ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని గత కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇటీవల సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘శుభం’ సినిమా సక్సెస్ మీట్‌లో కూడా రాజ్ నిడిమోరు ప్రత్యక్షమయ్యారు. అలాగే, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను అతనితో కలిసి దర్శించడం అనేక అనుమానాలకు దారితీసింది.
