Black Gold: సంయుక్తా మీనన్ బ్లాక్ గోల్డ్ ఫస్ట్ లుక్ వైరల్, మీరూ చూసేయండి
Black Gold: ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ తొలిసారిగా ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బ్లాక్ గోల్డ్’. యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే, మేకర్స్ తాజాగా ‘బ్లాక్ గోల్డ్’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశారు.
చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడిచే అనుభూతిని ఇస్తోంది. నిర్మానుష్యంగా ఉన్న రైల్వే ప్లాట్‌ఫాం బ్యాక్‌డ్రాప్‌లో, ఫైట్ తర్వాత తీవ్రమైన లుక్‌లో సంయుక్తా మీనన్ నిలబడి ఉంది. పోస్టర్‌లో ఆమె చుట్టూ ఐదుగురు రౌడీ మూకలు రక్తపు మడుగులో పడి ఉండటం కనిపిస్తుంది. ఇది సినిమాలో భారీ యాక్షన్ ఘట్టాలు ఉండబోతున్నాయని చెప్పకనే చెబుతోంది. సంయుక్తా ఇందులో ఎంతటి పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తుందో ఈ పోస్టర్ స్పష్టం చేసింది.
పోస్టర్‌లోని టైటిల్ లోగో కూడా ఆసక్తికరంగా ఉంది. బొగ్గు (నల్ల బంగారం) షేడ్స్‌లో, రాళ్లతో డిజైన్ చేసినట్టున్న టైటిల్‌లో మధ్యలో నాట్యం చేస్తున్న ప్రతిమ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే, ఈ సినిమా కథాంశం మొత్తం బొగ్గు మాఫియా (నల్ల బంగారం) చుట్టూ, దానికి సంబంధించిన థ్రిల్లర్ అంశాలతో నడుస్తుందని దర్శకుడు హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై రాజేష్ దండా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు శ్యామ్ సిఎస్ సంగీతాన్ని, ఏ వసంత్ సినిమాటోగ్రఫీని, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్‌ను అందిస్తున్నారు. ఈ సినిమాకు సంయుక్తా మీనన్ సమర్పకురాలిగా కూడా వ్యవహరిస్తుండటం మరో విశేషం. విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచిన సంయుక్త.. తన తొలి సోలో మెయిన్ రోల్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
