Sandeep Reddy Vanga: తెలంగాణ లవ్ స్టోరీతో సందీప్‌రెడ్డి వంగా కొత్త సినిమా.. డైరెక్టర్‌గా కాదు, నిర్మాతగా..!
Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు. తన సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ పై ఒక చిన్న చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాను రూపొందించే పనిలో ఉన్న సందీప్, తన దర్శకత్వ శైలితో, కథా కథనాలతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారడం ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. కొత్త దర్శకులకు, నటీనటులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ తొలి చిత్రానికి దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణు వ్యవహరించనున్నారు. ఇక హీరోగా ‘మేము ఫేమస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు సుమంత్ ప్రభాస్ నటించనున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఒక యువ ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుందని, కథ, కథనాలు సరికొత్త పంథాలో ఉంటాయని సమాచారం. ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న సందీప్, నిర్మాతగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో చూడాలి.
కాగా.. ‘స్పిరిట్’ సినిమా తొలి షెడ్యూల్ విదేశాల్లో జరగనుందని తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో లొకేషన్లను పరిశీలించి వచ్చారు. సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్, నవంబర్ నెలలో ‘స్పిరిట్’ టీమ్‌తో చేరనున్నారు.