Sanjay Dutt: ఒక్క తుపాకీ దొరక్కపోయినా జైలుకు పంపారు.. సంజయ్ దత్ కామెంట్స్
Sanjay Dutt: బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ తన జీవితంలో అత్యంత కష్ట కాలంగా చెప్పుకునే జైలు శిక్ష, ఆయుధాల కేసు అంశంపై తాజాగా కొన్ని సంచలన విషయాలను పంచుకున్నారు. తన వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోయినా దోషిగా ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని, అయినప్పటికీ ఆ అనుభవాన్ని తాను ఒక జీవిత పాఠంగా మార్చుకున్నానని ఆయన తెలిపారు.
1993 ముంబై పేలుళ్ల సంబంధిత ఆయుధాల కేసులో సంజయ్ దత్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ, “నా వద్ద తుపాకీ ఉందనే అనుమానంతో నన్ను అరెస్ట్ చేశారు. కానీ, నా దగ్గర ఆయుధాలు లేవని నిరూపించడానికి న్యాయస్థానానికి దాదాపు 25 సంవత్సరాలు ఎందుకు పట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
జైలు జీవితాన్ని తాను ఎంతో హుందాగా ఎదుర్కొన్నానని, ఆ కాలాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించినట్లు సంజయ్ దత్ వివరించారు. “నేను జైలులో ఉన్నన్ని సంవత్సరాలు ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాను. మత గ్రంథాలు, న్యాయశాస్త్రం గురించి అధ్యయనం చేశా. దేశ చట్టాలను, నియమాలను నేర్చుకున్నాను” అని తెలిపారు.
అంతేకాక, తన కేసును వేగంగా పరిష్కరించాలని తాను న్యాయస్థానాన్ని పలుమార్లు అభ్యర్థించానని పేర్కొన్నారు. ఈ అనుభవంలో, “తమకు సంబంధం లేని నేరాలకు జైలులో మగ్గుతున్న ఎంతోమంది వ్యక్తులను నేను దగ్గరగా చూశాను. ఇది నాకు ఎంతో బాధ కలిగించింది” అని ఆయన పంచుకున్నారు.
సంజయ్ దత్ తన వ్యక్తిగత జీవితంలోని మరో కఠినమైన అంశాన్ని కూడా గుర్తుచేసుకున్నారు: అదే బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న బెదిరింపులు. ఆ సమయంలో తమ కుటుంబ సభ్యులందరికీ తీవ్రమైన బెదిరింపు కాల్స్ వచ్చేవని ఆయన వెల్లడించారు.
ఇన్ని కష్టాలు చూసినా, తన తల్లిదండ్రులు త్వరగా తమను విడిచి వెళ్లిపోయారనే బాధ తప్ప, తన జీవితంలో జరిగిన ఏ విషయానికీ తాను బాధపడనని సంజయ్ దత్ గతంలోనూ పేర్కొన్నారు. సంజయ్ దత్ జైలు జీవితంపైనే దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ ‘సంజు’ అనే బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
