Sanjay Dutt: అభిమాని ఇచ్చిన రూ.72 కోట్ల ఆస్తిని తిరిగిచ్చేశా..: సంజయ్ దత్
Sanjay Dutt: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, తన క్రేజ్, సంపాదనతో పాటు తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న ఓ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆరేళ్ల క్రితం, అంటే 2018లో ఓ అభిమాని తన పేరిట రూ. 72 కోట్ల విలువైన ఆస్తిని రాసివ్వగా, సంజయ్ దత్ దానిని తిరిగి ఆమె కుటుంబానికే అప్పగించారు. ఈ సంఘటన ఆయన నిజాయితీని, అభిమానుల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని మరోసారి స్పష్టం చేసింది.
ఏంటా కథ..?
సంజయ్ దత్ తెలిపిన వివరాల ప్రకారం, నిషా పాటిల్ అనే మహిళా అభిమాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, తన చివరి రోజుల్లో తన మొత్తం ఆస్తిని (సుమారు రూ. 72 కోట్లు) సంజయ్ దత్‌కు చెందేలా బ్యాంకులో వీలునామా రాసిచ్చారు. “ఆమె నాపై చూపిన అభిమానం వేల కోట్ల ఆస్తితో సమానం. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ ఆస్తి మొత్తాన్ని ఆమె కుటుంబానికి తిరిగి ఇచ్చేశాను” అని సంజయ్ దత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యక్తిత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సినిమాలతో బిజీగా సంజయ్ దత్
ఒకప్పుడు కేసుల కారణంగా కెరీర్‌లో ఎదురుదెబ్బలు తగిలినా, ఇప్పుడు సంజయ్ దత్ మళ్లీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ దక్షిణాదిలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’ లో విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
దీంతో పాటు, తెలుగులో ‘రాజాసాబ్’ లో, బాలీవుడ్‌లో ‘దురంధర్’, కన్నడలో ‘కేడీ: ది డెవిల్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 1981లో ‘రాకీ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సంజయ్ దత్, ‘విధాత’, ‘నామ్’, ‘సాజన్’, ‘ఖల్ నాయక్’, ‘వాస్తవ్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానుల మదిలో చెరగని ముద్ర వేశారు. సినిమాల్లో ఆయన విలన్‌గా మెప్పించినా, నిజ జీవితంలో ఆయన చూపించిన ఈ ఔదార్యం అందరికీ ఆకట్టుకుంటోంది.
