Sanjay Dutt: జైలు జీవితంపై సంజయ్ దత్ షాకింగ్ కామెంట్స్..!
Sanjay Dutt: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో తన జైలు జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సహనటుడు సునీల్ శెట్టితో కలిసి ఈ షోకు వచ్చిన ఆయన, తన జైలు రోజుల్లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక హంతకుడితో తనకు ఎదురైన విచిత్రమైన సంభాషణ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
జైలులో ఉన్నప్పుడు గడ్డం తీయించుకోవడానికి ఒక బార్బర్‌ను ఏర్పాటు చేయమని సూపరింటెండెంట్‌ను కోరానని సంజయ్ దత్ తెలిపారు. అందుకు సూపరింటెండెంట్ ‘మిశ్రా’ అనే ఖైదీని నియమించారని చెప్పారు. మిశ్రా గడ్డం తీసే సమయంలో సంజయ్ దత్ అతనితో మాట్లాడుతూ, “ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు?” అని అడిగారు. దానికి మిశ్రా, “15 సంవత్సరాల నుంచి ఉన్నాను” అని బదులిచ్చారు. ఏం నేరం చేశావని అడగగా, “రెండు హత్యలు చేశాను” అని మిశ్రా చెప్పడంతో సంజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ సమయంలో మిశ్రా చేతిలో ఉన్న రేజర్ తన మెడ దగ్గర ఉండటంతో భయపడి వెంటనే అతని చేతిని పట్టుకున్నానని సంజయ్ వివరించారు. ఈ సంఘటన సరదాగా జరిగినప్పటికీ, ఆ క్షణాన్ని ఆయన ఇప్పటికీ మరిచిపోలేదని అన్నారు.
జైలులో కుర్చీలు, పేపర్ బ్యాగులు తయారు చేయడం వంటి పనులు చేశానని, వాటికి జీతం కూడా వచ్చిందని సంజయ్ తెలిపారు. అంతేకాకుండా, జైలులో ఖైదీల కోసం ఒక రేడియో స్టేషన్ ఏర్పాటు చేశానని, అది జైలు లోపల మాత్రమే ప్రసారం అయ్యేదని చెప్పారు. దీనికి కూడా తనకు డబ్బులు వచ్చేవని తెలిపారు. ఖైదీలతో కలిసి కామెడీ స్కిట్‌లు కూడా చేసేవాడినని, అందుకు కొంతమంది ఖైదీలు స్క్రిప్ట్‌లు రాసేవారని, తాను డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ వారిని నటులుగా ప్రోత్సహించేవాడినని సంజయ్ వెల్లడించారు.
తను జీవితంలో ఎదుర్కొన్న ఏ సంఘటనకూ బాధపడలేదని, కానీ తన తల్లిదండ్రులు త్వరగా తమను వదిలి వెళ్ళిపోయారనే బాధ మాత్రం తనను ఇప్పటికీ వెంటాడుతుందని సంజయ్ దత్ భావోద్వేగంతో చెప్పారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్ దత్ 2013 నుంచి 2016 వరకు జైలు జీవితం గడిపారు. ఆయన జైలు జీవితంపై రాజ్‌కుమార్ హిరానీ ‘సంజు’ అనే బయోపిక్ సినిమాను కూడా తెరకెక్కించారు.
