రాష్ట్రంలో మందుబాబులకు మంచి కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రప్రభుత్వం. కానీ బడా బాబులకేనండోయ్..
అసలు అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తాం అని చెప్పిన వైసిపి పార్టీ.. అధికారం లోకి వచ్చాక ఎక్కడా లేని బ్రాండ్లు తెచ్చి.. మద్యం ధరలు పెంచి అదే మద్యపాన నిషేధం అని జనాల చెవుల్లో పూలు పెట్టింది. దశలవారీగా మద్యం షాపుల ఎత్తేస్తాం అని చెప్పి దశలవారీగా మద్యం ధరలు పెంచి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళ నడ్డి విరిచింది. ఇప్పుడు మళ్లీ మద్యం ధరలు తగ్గిస్తూ దానికి అక్రమ మద్యం రవాణా అరికట్టడానికి అంటూ కొత్త కారణాలు చెబుతుంది.
“మద్యం ధరలు పెంచితే మద్యం కొనడం మానేస్తారు.. అదే మద్యపాన నిషేధం” అని చెప్పిన గవర్నమెంట్ మరి ఇప్పుడు మద్యం ధరలు తగ్గించడం ఏంటి? ఆ తగ్గించింది కూడా బడా బాబులు తాగే బ్రాండ్ల ధరలు మాత్రమే తగ్గించడం లో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వానికే తెలియాలి.. మద్యం ధరల్ని తగ్గిస్తూ ఈ రోజు అబ్కారీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత్ లో తయారయ్యే విదేశీ మద్యం మద్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరల తగ్గింపు 50 రూపాయల నుంచి 1350 రూపాయల వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో ఉన్న మందుబాబులకు ప్రస్తుతం దొరికే ధరకే ఇంకాస్త మంచి బ్రాండ్ తాగే అవకాశం దొరికింది.
ఈ ఉత్తర్వులు అక్టోబరు 30 తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కోన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ. బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పూ లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 200 రూపాయలు లోపు క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పు లేకపోవడంతో దిగువ స్థాయి వారికి ఈ నిర్ణయం పెద్దగా ఆనందం కలిగించదు.
200 రూపాయలు దాటిన క్వార్టర్ బాటిల్ ధరలను తగ్గించడంతో ఎగువ స్థాయి వర్గాలకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది.
బ్రాండ్లు, బాటిళ్ల పరిమాణాలను అనుసరించి 90 ఎంఎల్ కు 50 రూపాయల నుంచి లీటరు మద్యం ధర 1350 వరకూ తగ్గించారు.
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఈ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఎస్ ఈ బీ నివేదిక ఆధారంగా మద్యం ధరల తగ్గించారు. చీప్ లిక్కర్ తో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతుండటంతో ఈ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆబ్కారీ శాఖ తెలిపింది.
2020 సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మద్య కాలంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి 1211 కేసులు నమోదు అయినట్టు వెల్లడించారు. తెలంగాణా నుంచి 630, కర్ణాటక నుంచి 546, ఒడిశా నుంచి 24, తమిళనాడు నుంచి 11 కేసులు నమోదయ్యాయి. తెలంగాణా, కర్ణాటకల్లో మద్యం ఎమ్మార్పీ ధరలు ఏపీ కంటే రెండింతలు తక్కువ కావటంతోనే స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఎస్ఈబీ నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ధరల విషయంలో దిగిరాక తప్పలేదు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న ఏపీ మండలాల్లో పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా ఎస్ఈబీ తమ నివేదికలో పొందుపరిచింది.