Shah Rukh Khan: గొప్ప మనసు చాటుకున్న షారుఖ్ ఖాన్.. ‘మీర్ ఫౌండేషన్’ ద్వారా భారీ సహాయం
Shah Rukh Khan: ఇటీవల పంజాబ్‌ను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా, ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ మానవత్వం చాటుకున్నారు. తన స్వచ్ఛంద సంస్థ ‘మీర్ ఫౌండేషన్’ ద్వారా వరద బాధితులకు తక్షణ సహాయాన్ని అందించారు. ఈ సహాయ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఊరట కలిగిస్తున్నాయి.
మీర్ ఫౌండేషన్, పంజాబ్‌లోని స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. అమృత్‌సర్, పాటియాలా, ఫాజిల్కా, ఫిరోజ్‌పూర్ వంటి జిల్లాల్లోని దాదాపు 1500 కుటుంబాలకు అత్యవసర వస్తువులతో కూడిన సహాయ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో వైద్య సామాగ్రి, ఆహార పదార్థాలు, దోమ తెరలు, టార్పాలిన్ షీట్లు, మడతపెట్టే పడకలు వంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. తద్వారా బాధితులకు ఆరోగ్యపరమైన, భద్రతాపరమైన మరియు ఆశ్రయం అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నారు.
వరదలపై స్పందించిన షారుఖ్ ఖాన్ తన సోషల్ మీడియాలో ఒక హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. “ఈ కష్టకాలంలో నా హృదయం పంజాబ్ ప్రజలకు అండగా ఉంటుంది. వారికి నా ప్రార్థనలతో పాటు ధైర్యాన్ని పంపుతున్నాను. పంజాబ్ ప్రజల స్ఫూర్తి ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. దేవుడు వారందరినీ ఆశీర్వదించుగాక” అని ఆయన పేర్కొన్నారు. తమ అభిమాన నటుడి సహాయం పట్ల పంజాబ్ ప్రజలు, అభిమానులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో షారుఖ్ ఖాన్ చూపించిన ఉదారత, ఆయనలోని మానవత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ట్రాన్స్‌జెండర్లు తమ ఉదారతను చాటుకున్నారు. పంజాబ్ ప్రజలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఈ సహాయాన్ని సమీకరించేందుకు ఆగ్రాలోని ట్రాన్స్‌జెండర్ సంఘాలు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. మనదేశంలో కష్టాల్లో ఎవరున్నా సరే మానవత్వం చూపించాల నినాదంతో తమ ఆదాయంతో పాటు దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంగా వచ్చిన మొత్తాన్ని పంజాబ్‌కు పంపించారు.
