Shah Rukh Khan: షూటింగ్‌లో గాయంపై షారూక్ ఖాన్ భావోద్వేగం కామెంట్లు
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల ‘కింగ్’ సినిమా షూటింగ్‌లో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన గాయం గురించి, ఇటీవలే ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల గురించి ఆయన తాజాగా మాట్లాడారు. ముంబైలో జరిగిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
తన భుజానికి జరిగిన గాయంపై షారుఖ్ మాట్లాడుతూ, “శస్త్రచికిత్స జరిగింది, ఒకటి రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటాను. అయితే జాతీయ అవార్డు అందుకోవడానికి ఒక చేయి సరిపోతుంది. కానీ మీ అభిమానుల ప్రేమను మూటగట్టుకోవడానికి మాత్రం రెండు చేతులు కూడా సరిపోవు” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో షారుఖ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ అవార్డును విక్రాంత్ మాస్సేతో కలిసి అందుకోనున్నారు.
తన కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్‌సిరీస్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా షారుఖ్ ఆనందం వ్యక్తం చేశారు. “ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్యన్ నాలుగేళ్లు కష్టపడ్డాడు. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటున్నాడని చెప్పినప్పుడు, మా ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు యూట్యూబ్‌లో పెడతాడేమోనని భయపడ్డాను” అని నవ్వుతూ చెప్పారు. “అయితే, సిరీస్ చూశాక నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అతని ప్రతిభ చూసి చాలా సంతోషంగా ఉన్నాను” అని షారుఖ్ అన్నారు.
“ఈ సిరీస్‌లోని నటీనటులందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ప్రేక్షకులు థ్రిల్లింగ్‌గా ఫీలవడం ఖాయం” అని షారుఖ్ అన్నారు. ఈ సిరీస్ హిందీ సినీ పరిశ్రమ నేపథ్యంలో రూపొందింది. ముంబైతో తమ కుటుంబానికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆర్యన్ కూడా తన మొదటి అడుగు ఇక్కడే వేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.
తనపై చూపిన ప్రేమను తన కుమారుడిపైనా చూపిస్తారని ఆకాంక్షించారు. ఈ వెబ్‌సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా అందుబాటులోకి రానుంది. దీనిని షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సిరీస్‌లో లక్ష్య, సహేర్ మరియు బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు.