Shah Rukh Khan: అతను బాలీవుడ్ బాద్‌షా, 100 సినిమాలు చేశాడు.. అయితేనేం ఇదే తొలి జాతీయ అవార్డు
Shah Rukh Khan: భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. షారూఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్‌షా, కింగ్‌ఖాన్.. ఇలా ఎన్నో పేర్లతో షారూఖ్‌ను ముద్దుగా పిలుచుకుంటారు బాలీవుడ్ జనాలు. 100 కొద్దీ సినిమాలు తీశారు. అందులో సూపర్ డూపర్, బంపర్ బ్లాక్ బాస్టర్ హిట్లు ఎన్నో ఉన్నాయి. ‘దీవానా’, ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘స్వదేశ్’, ‘చక్‌దే! ఇండియా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘దేవదాస్’, ‘కభీ ఖుషీ కభీ గమ్’ ఇలా చాలానే హిట్లు ఉన్నాయి. 33 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన షారుక్ ఖాన్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క జాతీయ అవార్డు లేదంటే నమ్ముతారా. 33 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలి జాతీయ పురస్కారం దక్కడం పట్ల షారుఖ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జవాన్’లో తన అద్భుతమైన నటనకు గాను ఆయన ‘ఉత్తమ నటుడు’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని ’12th ఫెయిల్’ చిత్రంలో నటించిన విక్రాంత్ మాస్సేతో షారుఖ్ పంచుకున్నారు.
సినిమాపై అంతులేని ప్రేమ..
షారుఖ్ ఖాన్ అంటే కేవలం ఒక నటుడు కాదు, కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో నిలిచిన ఒక భావోద్వేగం. “చనిపోయే వరకూ సినిమాల్లోనే ఉంటా. ఏదైనా సినిమా సెట్‌లో యాక్షన్ చెప్పగానే నేను చనిపోవాలి. వాళ్లు కట్ చెప్పాక కూడా నేను పైకి లేవకూడదు. ఇదే నా కోరిక” అంటూ ఇటీవల ఓ సందర్భంలో షారుఖ్ పంచుకున్న మాటలు సినిమా పట్ల ఆయనకున్న అంతులేని ప్రేమను, అంకితభావాన్ని చాటిచెబుతాయి. ఈ నిబద్ధతే ఆయన్ని తిరుగులేని స్టార్‌గా నిలబెట్టి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది.
అంచెలంచెలుగా ఎదిగిన బాద్‌షా..
దిల్లీ నుంచి ముంబైకి వచ్చి, ఎటువంటి సినీ నేపథ్యం లేకుండానే తన సొంత ప్రతిభతో అగ్రతారగా ఎదిగిన షారుఖ్ ఖాన్ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. 1992లో ‘దీవానా’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన, ‘బాజీగర్’, ‘డర్’ వంటి చిత్రాల్లో విలక్షణమైన నెగెటివ్ పాత్రలతోనూ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ (1995)తో పూర్తిస్థాయి సూపర్ స్టార్‌గా మారారు.
