Sharmila as AP Congress President? : ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ కు సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ చాలా హాట్ టాపిక్ గా నిలిచింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం నియమించబోతుందని ఒక కీలక సమాచారం కొద్ది రోజులుగా బాగా ప్రచారం అవుతుంది. దీంట్లో వాస్తవం ఎంతో తెలియదు. కానీ చాలామంది ఇది నిజమే అన్నట్లుగా ఫిక్స్ అయిపోయారు.
ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల స్థాపించినటువంటి వైయస్సార్ తెలంగాణ పార్టీ పోటీకి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తమవడంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గింది. దీంతో షర్మిల ఒంటరిగానే మిగిలిపోయారు. అయితే షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీ ఏపీలో వినియోగించుకోవాలనుకుంటుందని ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది.
ఆ సమాచారం ప్రకారం వచ్చే కొత్త సంవత్సరంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ నీ బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దృష్టి పెట్టారని తెలుస్తుంది. అయితే షర్మిల నియామకం ద్వారా ఏపీలో కాంగ్రెస్ కు ఏ మేరకు లాభం చేకూరుతుందనే ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది.
మరోవైపు వైయస్ జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా మరోమారు విజయం పొందాలని ఆలోచనలతో చాలా రకాల వ్యూహాలను రచిస్తున్నారు. వైసీపీని ఓడించడం అంత సులువైన పని కాదు. ఒకవేళ వైయస్ షర్మిల, వైసిపి పై విమర్శలు దిగితే ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుందని చర్చనీయాంశం గా మారింది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ విజయం కోసం షర్మిల భారీగానే ప్రచారం నిర్వహించారు. బై బై చంద్రబాబు అంటూ అప్పుడు ఆమె ప్రసంగాలు ప్రజలను బాగానే ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు నేరుగా తన అన్న ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ పైన ఒకవేళ షర్మిల విమర్శలు చేస్తే అది జనాలకు ఏమాత్రం చేరుతుంది. వారి స్పందన ఏ విధంగా వస్తుందనేది ప్రశ్నార్థకమే. షర్మిలకు ఇప్పుడు అక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. ఏపీ రాజకీయాల్లో అడుగు పెడితే జనం నుంచి ఆమెకి ఎంతవరకు మద్దతు లభిస్తుందనేది కూడా వేచి చూడాల్సిందే. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న విధానం ఎంతవరకు సమంజసమో చూడాలి.