Biker Movie: శర్వానంద్ ‘బైకర్’ వాయిదా.. 3D, 4DX ఫార్మాట్లలో రేసింగ్ అనుభూతి ఇవ్వడానికేనా?
Biker Movie: చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బైకర్’ విడుదల వాయిదా పడినట్టు అధికారికంగా ప్రకటించారు. జనవరిలో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన పుకార్లను నిజం చేస్తూ, చిత్ర బృందం ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఈ ప్రకటనలో అభిమానులకు నిరాశకు బదులు ఉత్సాహాన్ని కలిగించే ఒక గొప్ప అప్‌డేట్‌ను కూడా జోడించారు.
సినిమా వాయిదాపై మూవీ మేకర్స్ తాజాగా ఒక నోట్ విడుదల చేశారు. “బైకర్ అనేది కేవలం స్క్రీన్లకే పరిమితమయ్యే చిత్రం కాదు, అంతకుమించిన అనుభవం. ఈ ‘బీస్ట్’ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి మా నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో రాత్రులు కష్టపడింది, కష్టపడుతోంది. మేము ఇప్పటివరకు చూపించిన దానికంటే ఈ సినిమా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుందని మమ్మల్ని నమ్మండి” అని మేకర్స్ కోరారు.
‘బైకర్’ ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా ప్రేక్షకులను అలరించనుందని చిత్ర బృందం ప్రకటించింది. “మీలో అడ్రినలిన్ పరుగులెత్తించేలా, మీ గుండె వేగంగా కొట్టుకునేలా చేసి, మిమ్మల్ని ఊపిరి ఆడకుండా చేయడానికి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాం. అందుకోసమే ‘బైకర్’ను 3D మరియు 4DX ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల చేయబోతున్నాం” అని పేర్కొన్నారు. మునుపెన్నడూ చూడని గొప్ప అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో మూడు తరాల కుటుంబ కథగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనుండగా, మాళవిక నాయర్ కథానాయిక. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. మూడేళ్ల తర్వాత శర్వానంద్ ఈ యాక్షన్ చిత్రంతో రాబోతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. విడుదల వాయిదా పడినా, త్రీడీ ఫార్మాట్‌లో బైక్ రేసింగ్ అనుభూతిని పొందవచ్చనే అప్‌డేట్ ఫ్యాన్స్‌ను కొంతవరకు సంతోషపరుస్తోంది.
