Arunachalam: అరుణాచలంలో ‘భక్తి’ తగ్గి ‘హడావిడి’ పెరిగింది.. శివాజీ రాజా కామెంట్స్ వైరల్
Arunachalam: ఆధ్యాత్మికతకు నిలయమైన అరుణాచలం (తిరువణ్ణామలై) ప్రాంతంలో భక్తులు చూపుతున్న అతి ఉత్సాహంపై సీనియర్ నటుడు శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలాన్ని సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఈ క్షేత్ర మహిమను వివరించిన తర్వాత ఈ రద్దీ మరింతగా పెరిగింది.
అయితే భక్తితో, ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవాల్సిన ఈ పవిత్ర స్థలాన్ని కొందరు కేవలం వెకేషన్ ట్రిప్‌లా చూస్తున్నారని, ఫోటోలు, వీడియోలు, వ్లాగ్‌లు అంటూ హడావిడి చేయడంపై శివాజీ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “అరుణాచలం గురించి ఎవరికీ తెలియని రోజుల నుంచే నేను, నా కుటుంబం 30 ఏళ్లుగా ఆ క్షేత్రాన్ని దర్శిస్తున్నాం. మేము కేవలం దండం పెట్టుకుని ప్రశాంతంగా తిరిగి వచ్చేస్తాం. రమణాశ్రమం లాంటి ప్రదేశాలు చాలా నిశ్శబ్దంగా, భక్తి భావనతో నిండి ఉంటాయి. విక్టరీ వెంకటేశ్, ఇళయరాజా వంటి ప్రముఖులు కూడా ఇక్కడ ప్రశాంతంగానే దర్శించుకుంటారు” అని శివాజీ రాజా గుర్తు చేసుకున్నారు.
కానీ ప్రస్తుత రద్దీ గురించి మాట్లాడుతూ… “ఇప్పుడు అరుణాచలం వెళ్లే వారిలో సుమారు 25 శాతం మంది దీనిని ఒక వెకేషన్ ట్రిప్‌గా భావిస్తున్నారు. స్టేటస్‌లు పెట్టుకోవడం, ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీయడంపైనే వారి దృష్టి ఉంటోంది. ఎక్కడ అడుగుపెట్టినా ఆ పవిత్ర వాతావరణాన్ని నాశనం చేస్తున్నారు” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకసారి తాను రాజా రవీంద్ర ఆశ్రమానికి వెళ్లినప్పుడు కొందరు సెల్ఫీలు తీసుకుంటూ అల్లరి చేయడంతో, విదేశీ భక్తులు వారిని నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించారని శివాజీ రాజా తెలిపారు. “మనవాళ్లు పూజ చేయడంలో భక్తి చూపుతారు కానీ, అతి చేసి వాతావరణాన్ని చెడగొడతారు. 75 శాతం మంది భక్తి కోసం వెళ్తే, మిగతా వారు ఫోటోల కోసం వెళ్లి అక్కడి పవిత్రతను చెడగొడుతున్నారు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని ఆయన పేర్కొన్నప్పటికీ, చాలా మంది నెటిజన్లు ఆయన మాటలను సమర్థిస్తున్నారు.
