Shivaji Raja: ఆ నటికి లవ్ లెటర్ రాస్తే మా ఆవిడకి చూపించింది.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సక్సెస్ మీట్లో శివాజీ రాజా
Shivaji Raja: తక్కువ బడ్జెట్లో తెరకెక్కి ప్రేక్షకుల మన్నన పొంది, విజయాన్ని అందుకున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా బృందం మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ ఆద్యంతం నవ్వులతో సందడిగా సాగింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు శివాజీ రాజా తనదైన మాటలతో హాస్యం పండించి, గత జ్ఞాపకాలను పంచుకోవడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమాలో శివాజీ రాజా సరసన సీనియర్ నటి అనితా చౌదరి నటించిన విషయం తెలిసిందే. ఈ వేదికపై శివాజీ రాజా మాట్లాడుతూ.. తనకి, అనితకి మధ్య ఉన్న పాత అనుబంధాన్ని, వృత్తిపరమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ, “నేను, అనిత కలిసి చాలా సినిమాల్లో నటించాం. ముఖ్యంగా ‘మురారి’ సినిమా షూటింగ్ సమయంలో ఒక సరదా సంఘటన జరిగింది. అప్పుడు డైరెక్టర్ కృష్ణవంశీ సరదాగా అనితకు ఒక లవ్ లెటర్ రాయమని నన్ను అడిగాడు. దర్శకుడు చెప్పాడు కదా అని, నేను కూడా గోదావరి యాసలో అనితకు ఒక ప్రేమలేఖ రాశాను” అని గుర్తు చేసుకున్నారు.
అయితే ఆ ప్రేమలేఖకు సంబంధించిన తదుపరి పరిణామాలు మరింత హాస్యాన్ని సృష్టించాయి. “ఆ లెటర్‌ను అనిత ఊరికే ఉంచకుండా, ‘మురారి’ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చూపించింది. అంతేకాదు, ఒకానొక సందర్భంలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆసుపత్రికి వచ్చి, నా భార్యకు కూడా చూపించింది” అని శివాజీ రాజా వెల్లడించగా, వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు.
ఆ సమయంలో జరిగిన ఈ సంఘటనలు ఇప్పటికీ తనకి మంచి జ్ఞాపకాలని శివాజీ రాజా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సక్సెస్ మీట్‌కి సంబంధించిన శివాజీ రాజా వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న చిత్రాలు కూడా మంచి కంటెంట్‌తో విజయం సాధిస్తాయని ‘రాజు వెడ్స్ రాంబాయి’ మరోసారి నిరూపించింది.
