అనంతపురం జిల్లాలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాసం, భృతి ప్రక్రియ పూర్తి చేయకుండానే ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేసి, ఇళ్లు కూల్చడం అప్రజాస్వామిక చర్య , ఇళ్ళలో మనుషులు ఉండగానే జేసీబీలతో కూల్చి అందులో ఉన్న వారిని ఆసుపత్రుల పాలు చేయడం దుర్మార్గం అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
భయబ్రాంతులకు గురి చేసి ఊరిని ఖాళీ చేయించాలి అనుకోవడం పాలకుల్లో నిండిన నియంతృత్వ పోకడలను తెలియచేస్తోంది. ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని మర్రిమాకులపల్లె గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలు బాధాకరంగా ఉన్నాయన్నారు.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో మునిగిపోయే ప్రాంతాల్లో ఇప్పటికీ పరిహారం, పునరావాసం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి అనుకోవడం చట్ట వ్యతిరేకం. మర్రిమాకులపల్లెలో ఇంట్లో ఉన్న వారిని కూడా పట్టించుకోకుండా కూల్చివేతలు చేయడం వల్ల మూడేళ్ల పసి బిడ్డ నాగచైతన్య, వృద్ధురాలు శ్రీమతి పార్వతమ్మ గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.
ఇదేమని అధికారులను ప్రశ్నించినవారిపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ఉందని అర్ధం అవుతోంది. మానవ హక్కులను ఉల్లంఘిస్తూ – ఇళ్ళలో కుటుంబాలు ఉండగానే
కూల్చివేతలు మొదలుపెట్టిన అధికారులుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మర్రిమాకులపల్లి ప్రజలను పరామర్శించేందుకు వెళ్తున్న మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారిని గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ఖండిస్తున్నాం అని తెలిపారు.
బాధితులకు బాసటగా లేకుండా చేయాలనే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు సంబంధించి మర్రిమాకులపల్లె, పి.సి.రేవు, సి.సి.రేవు గ్రామాలవారికి చట్టబద్ధంగా పరిహారం, పునరావాసాల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు.
అలాగే 18 ఏళ్ళు నిండిన వారికి రూ.10 లక్షల భృతి ఇవ్వడంలోను అధికారులు మెలికలు పెడుతున్నారు. 2020నాటికి 18 సం. నిండిన ప్రతి ఒక్కరిని ఆ భృతికి అర్హులుగా ప్రకటించాలన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తరవాతే ముంపు గ్రామాల వారిని ఖాళీ చేయించాలి. చిత్రావతి ముంపు బాధితులపై మానవత్వం చూపించాలని మనోహర్ డిమాండ్ చేశారు.