Sivakarthikeyan: టాలీవుడ్ సినిమాలు వెయ్యి కోట్లు వసూలు చేస్తాయి.. ఎందుకో చెప్పిన శివకార్తికేయన్
Sivakarthikeyan: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన శివకార్తికేయన్, సెప్టెంబర్ 5న విడుదల కానున్న తన చిత్రం ‘మదరాసి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ, తెలుగు నిర్మాతల గొప్పతనాన్ని, తెలుగు సినిమా మార్కెట్ శక్తిని వివరించారు.
టాలీవుడ్‌పై శివకార్తికేయన్ ఆసక్తికర వ్యాఖ్యలు
“టాలీవుడ్ నిర్మాతలు కంటెంట్ విషయంలో ఎప్పుడూ రాజీపడరు. ఒక కథ వారికి నచ్చితే, దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అందుకే తెలుగు సినిమాలు తరచుగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి,” అని శివకార్తికేయన్ అన్నారు. చిరంజీవి, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలతో పనిచేసిన మురుగదాస్ దర్శకత్వంలో నటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “నా ప్రాణ స్నేహితుడు అనిరుధ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించాడు. ఆయన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. అనిరుధ్ సంగీతం అందిస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్టే,” అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత ప్రసాద్ గురించి మాట్లాడుతూ, ఆయన గొప్ప నిర్మాత అని, కంటెంట్‌ను నమ్మితే ఖర్చుకు వెనకాడరని ప్రశంసించారు.
సక్సెస్ కంటే అభిమానుల ప్రేమాభిమానాలే తనకు ముఖ్యమని శివకార్తికేయన్ చెప్పారు. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే తన తండ్రిలాగే పోలీస్ అయ్యేవాడినని తెలిపారు. చిత్ర పరిశ్రమలోకి రావడానికి రజనీకాంత్ స్ఫూర్తి అని, తాను కాలేజీ రోజుల నుంచే మిమిక్రీ చేసేవాడినని వెల్లడించారు. తన కెరీర్ ప్రారంభం నుంచి నమ్మిన వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ, తన స్నేహితులు, తన భార్య ఆర్తి గురించి భావోద్వేగంగా మాట్లాడారు. “నేను హీరో కాకముందు, మంచి జీతం లేనప్పుడే ఆర్తి నన్ను నమ్మి పెళ్లి చేసుకుంది. నా జీవితంలోకి ఆమె రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది,” అని అన్నారు. హీరోయిన్ రుక్మిణి గురించి మాట్లాడుతూ, ఆమె ప్రతిభావంతురాలని, భవిష్యత్తులో ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానని ఆకాంక్షించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయని శివకార్తికేయన్ చెప్పారు.