Smart Phone : స్మార్ట్ ఫోన్ ఎంత ఉపయోగకరమో కొన్ని సందర్భాలలో అంత హానికరం కూడా. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం ఫోన్ పేలిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఫోన్ మాట్లాడుతుంటే చేతిలో ఫోన్ పేలిపోయి మంటలు వచ్చాయి. దానివల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివి మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూడా రెండు, మూడు సందర్భాల్లో ఇలానే జరిగాయి.
ఫోన్ పేలి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ వార్త చాలామందిని ఆందోళనకు, ఆవేదనకు గురిచేసింది. ఎందుకంటే ఇప్పటి యువత కానీ, పిల్లలు కానీ ఎప్పుడూ ఫోన్ వాడకంలో చాలా బిజీగా ఉంటున్నారు. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు వాళ్లకు తెలియవు. వాళ్ళు కోరుకునే వినోదం ఫోన్ లో లభించడంతో ఎక్కువగా మొబైల్ ఫోన్ ని ఆశ్రయిస్తున్నారు.
కానీ ఒక్కోసారి అదే ప్రమాదవశాత్తు ప్రాణాలను తీసేస్తుంది. ఫోన్ ఓవర్ హీట్ అయితే దాన్ని ఎలా నివారించాలి? ఫోన్ పేలకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఫోన్ పేలిపోవడం లాంటి సందర్భాలు వేసవిలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దానికి కారణం అధిక వేడి. వేసవిలో ఉష్ణోగ్రతలు హెచ్చుగా ఉండడం వల్ల ఆ ప్రభావం ఫోన్ పైన పడుతుంది.
దానివల్ల ఫోన్ ఎక్కువగా ఉపయోగించే మనపైన ఆ దుష్ఫలితం చూపిస్తుంది. స్మార్ట్ ఫోన్ తయారు చేసే కంపెనీలు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫోన్ పేలుళ్ళను నివారించలేకపోతున్నారు. ఇది నిరంతర సమస్యలా వృద్ధి చెందుతూ ఉంది. అవసరానికి మించి స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల ఫోన్ పేలుళ్లు అనేవి ఎక్కువగా సంభవిస్తున్నాయి.
అయితే దీని నుండి బయటపడడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పేలుళ్లను కాస్తయినా తగ్గుముఖం పట్టించుకోవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఫోన్లో చార్జింగ్ ఉన్నప్పుడు డైరెక్ట్ సూర్యకాంతి పడుతున్న సమయంలో ఫోను ఎక్కువ సేపు ఉపయోగించడం మంచిది కాదు. అలాంటి టైంలో ఫోన్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం కూడా ప్రమాదం.
ఎందుకు అంటే కంపెనీ ఆమోదించిన చార్జర్లు అయితే పర్వాలేదు కానీ మామూలు చార్జర్ వాడినప్పుడు అధిక వేడికి ప్రమాదం సంభవించవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ అవసరానికి మించి గంటల తరబడి ఛార్జింగ్ పెట్టి ఉంచకూడదు. దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. ఫోన్ చార్జింగ్ పూర్తవగానే వెంటనే చార్జర్ నుండి డిస్కనెక్ట్ చేసేయాలి.
అలాగే ఫోన్ ని దిండు కింద కానీ తల పక్కన గాని పెట్టుకొని అసలు నిద్రించకూడదు. ఫోన్ అధికంగా ఉపయోగించినప్పుడు కాసేపు దాన్ని చల్లబచవలసిన అవసరం ఉంది. కాబట్టి ఫోన్ ని స్విచ్ఆఫ్ చేసి పక్కకు పెట్టడం ఉత్తమం. నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఫోను వినియోగించేవారు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు సంభవించడం మాత్రం ఖచ్చితం.