రాష్ట్రంలో మీడియా సంస్థలు విశ్వసనీయత కోల్పోయాక ప్రధాన రాజకీయ పార్టీలు సోషల్ మీడియా పై ఎక్కువగా ఆధారపడ్డాయి. అధికారంలో ఉన్న వారు తాము సాధించిన విజయాల ప్రచారం కోసం ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడం అవే వేదికలుగా ప్రతిపక్ష పార్టీలు నిజాలని నిగ్గు తేల్చడం పరిపాటిగా మారింది. కానీ సోషల్ మీడియాతో ఒక్కోసారి పార్టీలకు జరిగే లాభం కంటే కొన్ని సందర్భాలలో వచ్చే నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. మార్ఫింగ్ ఫోటోలు, అసత్య ప్రచారాలు కూడా జరుగుతూ ఉండడంతో ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఇబ్బందులపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇటీవలే నాగబాబు పాల్గొనే అదిరింది షోలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఒక కామెడీ యాక్టర్ చేసిన స్కిట్ ట్రైలర్ వివాదానికి ఆజ్యం పోసింది. దీనికి సంబంధించిన విమర్శల్లో భాగంగా దీపికా కడారి అనే ఒక ఎన్నారై మహిళ ఫేస్ బుక్ వేదిక గా విమర్శలు గుప్పించారు. ఆమె దాడి జీ తెలుగు ఛానల్ యాజమాన్యం కంటే చిరంజీవి కుటుంబం పై కేంద్రీకృతం కావడంతో మెగా అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. ఆమె ఒకడుగు ముందుకు వేసి కాపు కులాన్ని కూడా టార్గెట్ చెయ్యడంతో వివాదం ముదిరి పాకాన పడింది.రాష్ట్రంలో కాపు సంఘాల నాయకులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీపిక వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పినా వారి ఆగ్రహం చల్లారాలేదు.
ఇదే విధంగా తరచుగా వివాదాస్పద లైవ్ లు ఇస్తున్న N.R. I ప్రభాకర్ రెడ్డి తీరు కూడా పార్టీ దృష్టి కి వెళ్ళింది. వివిధ కులాల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయనపై కూడా పలువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులాలు, మతాల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బ తినే పరిస్థితి రావడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఎంత హెచ్చరించినా వారి విధానం మారకపోవడంతో వారిద్దరికీ పార్టీకి సంబంధం లేదని వైసీపీ ఎన్నారై విభాగం వారు ఒక ప్రకటనలో తెలియజేసారు. వ్యక్తిగత ప్రచార మోజులో పార్టీ ప్రతిష్ఠకు దెబ్బ తీసే వ్యక్తుల్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.