బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు జన్మదినం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. సోము వీర్రాజు గారు నాకు అత్యంత ఆత్మీయులు, యువ రాజకీయవేత్తగా భారతీయ జనతా పార్టీ లో అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ఆయన బీజేపీలోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని పవన్ కోనియాడారు. ఆ నిబద్ధతను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ఆయన తుది వరకు నిలబడతారని, పార్టీకి మంచి ఫలితాలు అందిస్తారని ఆయన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష స్థాయికి చేర్చింది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై సమగ్ర అవగాహన, పాలన, విధానపరమైన అంశాలపై పట్టు ఉన్న నేత సోము వీర్రాజు అని పవన్ ప్రశంసించారు.
ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడానికి వీర్రాజు గారి నాయకత్వంలోని బిజెపి శ్రేణులతో కలిసి నిరంతరం కృషి చేస్తామని వీర్రాజు గారికి సుఖ సంతోషాలతో కూడిన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.