భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుండీ విలక్షణ శైలిలో దూసుకుపోతున్న సోము వీర్రాజు రాజకీయపరమైన నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలలో కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు శాలువాలు తీసుకురావద్దని కేవలం పేదలకు ఉపయోగపడే వస్త్రాలను మాత్రమే స్వీకరిస్తానని పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన కార్యాలయ వర్గాలు ఒక లేఖను విడుదల చేశారు. పేదల అవసరాలకు వీలుగా మనం వస్త్ర దానం కూడా చేయవచ్చు, నిరుపయోగమైన శాలువాలతో వేల రూపాయల వృధా చేసే కార్యక్రమాన్ని నేటితో విరమించుకోవాలసిందిగా నాయకులు కార్యకర్తలు అందరికీ నా మనవి.
పేదలకు పంచడానికి వీలుగా ఉండే తువాళ్ళు, లుంగీలు, పంచెలు, లాంటి వస్త్రాలు పేదల సహాయార్థం స్వీకరించబడతాయి. నేటి నుండి పూర్తి స్థాయిలో శాలువాలు తీసుకునే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని, నన్ను కలిసి సందర్భాల్లో గౌరవార్ధం గా తీసుకువచ్చే శాలువాలకు బదులుగా పేదల సహాయం కొరకు ఉపయోగపడే వస్త్రాలు మాత్రమే తీసుకొని రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అని సోము వీర్రాజు కార్యాలయ వర్గాలు లేఖలో పేర్కొన్నారు.
ఏదేమైనా బీజేపీ నేతలు అవలంబించే పద్ధతులు, వినూత్నంగా ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉంటాయని మరోసారి నిరూపించారు. గతంలో తెలంగాణ బిజెపి నేత కిషన్ రెడ్డి పుష్పగుచ్చాలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలను సేకరించి వాటిని పాఠశాలల్లో పంపిణీ చేసారు. ఇప్పుడు సోము వీర్రాజు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మరో సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారని చెప్పవచ్చు.
