Soothravakyam OTT Release: OTTలోకి రాబోతున్న మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్..!
Soothravakyam OTT Release: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఓటీటీ సినిమా వీక్షణ అభిరుచికి అనుగుణంగా.. ఇటివలి కాలంలో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే మలయాళంలో మంచి విజయం సాధించిన థ్రిల్లర్ చిత్రం ‘సూత్రవాక్యం’ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్లలో మంచి స్పందన సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత విస్తృతమైన ప్రేక్షకులకు చేరువ కానుంది. ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 21 నుండి స్ట్రీమింగ్ కానుంది.
‘సూత్రవాక్యం’ సినిమా ప్రధానంగా ఒక పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. మలయాళంలో ప్రముఖ నటులైన షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్, దీపక్ పరంబోల్ ముఖ్య పాత్రలు పోషించారు. కథానాయకుడు షైన్ టామ్ చాకో ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిగా కనిపిస్తారు. ఆయన తన పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లలకు ఉచితంగా గణితం పాఠాలు కూడా బోధిస్తుంటారు. ఆయన జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలోనే.. ఒక విద్యార్థి అదృశ్యం కేసును పరిష్కరించే బాధ్యత ఆయనపై పడుతుంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు ఊహించని నిజాలు తెలుస్తాయి. ఇది కేవలం ఒక అదృశ్యం కేసు కాదని, దీని వెనుక ఒక హత్య కేసు కూడా ఉందని ఆయనకు అవగతమవుతుంది. ఈ మిస్సింగ్, మర్డర్ కేసులకు ఉన్న సంబంధం ఏంటి? పోలీస్ అధికారి ఆ నేరాలను ఎలా ఛేదించారు అనేదే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రం సాధారణ ప్రారంభం తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథనం కొత్త మలుపు తీసుకుంటుంది. మామూలు కమర్షియల్ హంగులు, హీరో ఎలివేషన్స్ లేకుండా చాలా వాస్తవికంగా, ఉత్కంఠభరితంగా ఈ సినిమాను రూపొందించారు.
దర్శకుడు యూజియన్ జోస్ చిరమ్మేల్ ఈ కథను కనీస అంచనాలతో ప్రారంభించి, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచేలా స్క్రీన్‌ప్లేను అద్భుతంగా రాసుకున్నారు. ఈ సినిమా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది. ‘సూత్రవాక్యం’ మలయాళంలోనే వచ్చినప్పటికీ.. దీన్ని తెలుగులోకి కూడా అనువదించి ఓటీటీలో విడుదల చేయబోతున్నారు.
