Sruthi Hassan: ‘పవన్ కల్యాణ్ నుంచి అది దొంగలిస్తా’.. శృతి హాసన్ కామెంట్స్
Sruthi Hassan: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. సినిమా యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో నటి శృతి హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన శృతి హాసన్, లోకేష్ కనగరాజ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ తనకెంతో బలమైన పాత్రను ఇచ్చారని, రజినీకాంత్ వంటి లెజెండరీ యాక్టర్‌తో కలిసి నటించడం తన కెరీర్‌లో ఒక మైలురాయి అని శృతి అన్నారు. ఈ సినిమాలో అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఒక హైలైట్ అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రభాస్ నుంచి ఫుడ్, నాగార్జున నుంచి డైట్ దొంగిలిస్తా..
అక్కినేని నాగార్జున ఫెంటాస్టిక్ పర్‌ఫార్మెన్స్‌పై కూడా శృతి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్ సుమ సరదాగా అడిగిన ప్రశ్నలకు శృతి సమాధానాలు ఇచ్చారు. వివిధ స్టార్ హీరోల నుంచి ఏం దొంగలించాలని అడిగినప్పుడు శృతి ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకులను అలరించాయి. పవన్ కల్యాణ్ నుంచి ఎనర్జీ, ప్రభాస్ నుంచి ఫుడ్, అల్లు అర్జున్ నుంచి డాన్సింగ్, మహేష్ బాబు నుంచి స్టైల్, బాలకృష్ణ నుంచి హ్యూమర్, రజినీకాంత్ నుంచి అన్నీ, నాగార్జున నుంచి డైట్, ఫిట్‌నెస్‌ను దొంగలించాలని సరదాగా బదులిచ్చారు.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాను నమ్మి తనకు అవకాశం ఇచ్చిన రజినీకాంత్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో నాగార్జున పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటుల సహకారాన్ని కూడా లోకేష్ మెచ్చుకున్నారు. ‘కూలీ’ కేవలం మాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, క్లాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తెలుగులోనూ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నట్టు లోకేష్ తెలిపారు.
