SSMB29: రాజమౌళి – మహేష్ బాబు SSMB 29 ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్.. మూడు సర్‌ప్రైజ్‌లు సిద్ధం
SSMB29: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం ‘ఎస్ఎస్ఎంబి 29’కి సంబంధించి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ ఈరోజు (శనివారం, నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ భారీ వేడుకలో సినిమాకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
నిర్వాహకుల సూచనల మేరకు, ఈవెంట్‌కు హాజరయ్యే పాస్‌పోర్ట్ హోల్డర్లు సాయంత్రం 5 గంటలకే వేదిక వద్దకు చేరుకోవాలని కోరారు, భారీగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా రావాలని కోరారు. ఈవెంట్ కోసం ఎల్లో, ఆరెంజ్, పింక్ రంగులలో ప్రత్యేక పాస్‌పోర్ట్‌లను జారీ చేశారు, సీటింగ్ ఏర్పాట్లు ఈ పాస్‌పోర్ట్‌ల రంగులను బట్టి కేటాయించినట్లు సమాచారం.
ఈ ప్రత్యేక వేడుకను జియో హాట్‌స్టార్‌లో రాత్రి 7 గంటల నుండి లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయంగా ఈ ఈవెంట్‌కు ప్రాధాన్యత కల్పించేందుకు హాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన వెరైటీ సంస్థ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి, నటీనటులు ప్రియాంక చోప్రా (మందాకిని పాత్ర), సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గాయకులు శ్రుతి హాసన్, కాలభైరవ హాజరుకానున్నారు. ప్రముఖ యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లుక్స్‌తో పాటు ‘సంచారి సంచారి’ పాట విడుదలయ్యాయి. ఈవెంట్‌లో వీటిని ప్రదర్శించనున్నారు. అయితే, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి ఈ వేదికపై సినీ అభిమానుల కోసం మూడు భారీ సర్‌ప్రైజ్‌లను సిద్ధం చేశారు.
సినిమా టైటిల్ రివీల్: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పేరును అధికారికంగా ప్రకటించడం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం. సినిమా నిర్మాణంలో ఉన్న ముఖ్యమైన సన్నివేశాలను లేదా మేకింగ్ ప్రక్రియను చూపించే వీడియోను విడుదల చేయడం. మొత్తానికి అత్యంత భారీ స్థాయిలో జరుగుతున్న ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ వేడుక సినీ ప్రియులకు ఓ గొప్ప పండుగ వాతావరణాన్ని అందించడం ఖాయం.
