ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓటరు నమోదు ఇంఛార్జీలతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో లో మాట్లాడిన కేటీఆర్ పార్టీ శ్రేణులకు పలు అంశాల పైన దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ ముందుకు పోతుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పైన, వాటి వల్ల ప్రజలకు అందుతున్న ప్రతి ఫలాలపైన ఓర్వలేనితనంతో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై న ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని దీన్ని గట్టిగా తిప్పికొట్టాలని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విద్యాధికులకు చేర్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవాలను ఎండగట్టి వాస్తవాలను ప్రజల్లోకి గణాంకాలతో సహా తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిందని మరోవైపు టియస్ ఐపాస్ ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలను రాష్ట్రంలో కల్పించామన్నారు.
తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినూత్నమైన సంస్కరణలకు పెద్దపీట వేస్తుందని అందులో భాగంగానే నూతన పంచాయితీ రాజ్, మునిసిపల్, రెవెన్యూ చట్టాలను తీసుకు వచ్చామన్నారు. ఒకవైపు పల్లెలు మరోవైపు పట్టణాలు “పట్టణ ప్రగతి”, “పల్లె ప్రగతి” కార్యక్రమాలతో అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైతాంగాన్ని బలోపేతం చేసేటువంటి అనేక కార్యక్రమాలను టిఆర్ఎస్ పార్టీ చేపట్టిందన్నారు. రైతుబంధు, రైతుభీమా వంటి కార్యక్రమాలతో పాటు రైతు పండించిన ప్రతి గింజను కొన్న ప్రభుత్వం తమ ప్రభుత్వం అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాలమూరు పచ్చ బడిందని వలసలు ఆగిపోయాయి అన్నారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు పోతున్నారన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలో బలమైన శక్తిగా ఉన్నదని ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తన బలాన్ని చాటుకున్నదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే వారు పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడరు అని అన్నారు.
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక వ్యూహంతో పార్టీగా ముందుకు పోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ ని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు అందరూ తొలిరోజే తమ ఓట్లను, తమ కుటుంబ సభ్యుల ఓటర్లను నమోదు చేయించుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి కార్యకర్త అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని ఓటరుగా నమోదు చేయించుకోవాలి అన్నారు. తాను కూడా ఒకటవ తేదీన ఓటరుగా నమోదు చేయించుకుంటానని ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్నారు.
