Su From So: ఓటీటీలోకి ‘సు ఫ్రమ్ సో’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Su From So: కన్నడలో ఘన విజయం సాధించి, తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న హారర్ కామెడీ చిత్రం ‘సు ఫ్రం సో’ (Su From So) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు, ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు. అలాంటి వారి ఎదురుచూపులకు పుల్‌స్టాప్ పెడుతూ ఓటీటీలోకి తీసుకు వచ్చారు. ముఖ్యంగా సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని జయో సినిమా వేదికగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ఈ మేరకు జియో సినిమా అధికారిక ప్రకటన విడుదల చేసింది. జేపీ తుమినాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయడంతో మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది.
‘సు ఫ్రం సో’ చిత్రం కథాంశం ఒక గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కర్ణాటకలోని ధర్మస్థలి ప్రాంతానికి సమీపంలో ఉండే ఒక ఊరిలో అశోక్ అనే యువకుడి కథ ఇది. ఒక పెళ్లి నుంచి తిరిగి వస్తున్న అశోక్, తాను ప్రేమించిన అమ్మాయి ఇంటి వద్ద ఆగుతాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆమె ఇంట్లో దెయ్యం పట్టినట్లుగా డ్రామా చేస్తాడు. అయితే, అతని డ్రామా ఊరంతా పాకి, నిజంగానే అతనికి దెయ్యం పట్టిందని అందరూ నమ్మడం మొదలుపెడతారు.
దెయ్యాన్ని వదిలించడానికి రవన్న (షానిల్ గౌతమ్) అనే ఊరి పెద్ద సిటీ నుంచి ప్రముఖ స్వామీజీ కరుణాజీ (రాజ్ బి శెట్టి)ని తీసుకువస్తాడు. ఈ దెయ్యం డ్రామా వల్ల ఆ ఊరిలో ఎలాంటి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి? అసలు అశోక్‌కు నిజంగానే దెయ్యం పట్టిందా లేదా? అనే విషయాలు సినిమాలో హాస్యం, ఉత్కంఠ కలగలిపి చూపించారు. ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులకు ఓ మంచి వినోదాన్ని అందిస్తుంది.