తెలంగాణా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో
వరద ప్రభావిత కాలనీల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా ఆరోగ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అధికారులను పురపాలకశాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఆదేశించారు.
ఉన్నతాధికారులతో కేటీఆర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇటువంటి వరద సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా కోరారు. వరదల వల్ల కూలిన ఇండ్ల గణనను వెంటనే పూర్తిచేయాలని, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ అదనపు పరికరాలను, యంత్రాలను, సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశం సందర్భంగా మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన రేషన్ కిట్లు, దుప్పట్ల పంపిణీని సమీక్షించారు. ఈ భేటీలో మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ స్వేతా మహంతి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, అగ్నిమాపక అధికారులు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ విభాగ అధికారులు పాల్గొన్నారు.