Jatadhara Trailer: సుధీర్ బాబు ‘జటాధర’ ట్రైలర్ రిలీజ్.. ధన పిశాచి వచ్చేది ఎప్పుడంటే?
Jatadhara Trailer: టాలీవుడ్ కథానాయకుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’ విడుదల తేదీ ఖరారైంది. వెంకట్ కళ్యాణ్ కథను అందించడంతో పాటు, అభిషేక్ జైస్వాల్‌తో కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మైథాలాజికల్, సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ నవంబర్ 07న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ద్విభాషా ప్రాజెక్ట్‌గా రూపొందించారు.
ఈ సినిమాతో బాలీవుడ్ అగ్ర నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సుధీర్ బాబుకు ధీటుగా ఆమె ఇందులో శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ ఉత్కంఠభరితమైన ట్రైలర్‌ను విడుదల చేశారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.
ట్రైలర్‌ను పరిశీలిస్తే, ‘జటాధర’ పురాతన కథనాల మూలాల నుంచి తీసిన కథాంశంతో సాగే పౌరాణిక హారర్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. ఇందులో సుధీర్ బాబు అతీత శక్తులను నమ్మని ఒక పాత్రలో కనిపిస్తే, సోనాక్షి సిన్హా ధనాశతో పుట్టిన ధన పిశాచిగా ఉగ్రరూపం దాల్చారు. ఒక నిధిని కాపాడుతున్న పిశాచ బంధనం అనే శక్తిని తొలగించబోయి, మానవ అత్యాశ కారణంగా ఆ పిశాచిని విడుదల చేయడం, దాని కోసం ఒక శిశు బలి జరగబోతుండటం… ఇవన్నీ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. వెలుగుకు-చీకటికి, మానవ సంకల్పానికి-విధికి మధ్య జరిగే భీకర పోరాటమే ఈ సినిమా అని తెలుస్తోంది.
ఈ భారీ చిత్రంలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.