Suniel Shetty: సౌత్ సినిమాల్లో విలన్ పాత్రలు నచ్చలేదు.. బాలీవుడ్ నటులకు వస్తున్న ఆఫర్లపై సునీల్ శెట్టి అసంతృప్తి
Suniel Shetty: ప్రస్తుతం దక్షిణ భారతీయ సినిమాల్లో బాలీవుడ్ అగ్ర నటులు విలన్ పాత్రలు పోషించడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ ధోరణి తనకు ఏమాత్రం నచ్చడం లేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty) సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్ చిత్రాలలో హిందీ నటులకు కేవలం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మాత్రమే ఆఫర్ చేయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. “నాకు దక్షిణాది చిత్రాల నుంచి తరచూ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటంటే.. హిందీ హీరోలకు కేవలం ప్రతి నాయక (నెగెటివ్) పాత్రలు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. హిందీ నటులను శక్తివంతమైన విలన్లుగా చూపిస్తేనే సినిమాకు, ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని ఇండస్ట్రీ భావిస్తోంది. వ్యక్తిగతంగా నాకు ఇది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అటువంటి పాత్రలకు సంబంధించిన ఆఫర్లను నేను తిరస్కరిస్తున్నాను,” అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో తాను సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించిన విషయాన్ని అంగీకరిస్తూ.. “రజనీ సర్‌తో కలిసి నటించాలనే ఏకైక బలమైన కోరికతోనే ఆ సినిమాను ఒప్పుకున్నాను” అని వివరణ ఇచ్చారు. సినిమాల్లో భాషా సరిహద్దులు చెరిగిపోయాయని, ఇప్పుడు కేవలం కంటెంట్ మాత్రమే కింగ్ అని సునీల్ శెట్టి బలంగా చెప్పారు. కంటెంట్ బాగుంటే, అది అన్ని హద్దులను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సునీల్ శెట్టి ఇటీవల తుళు భాషా చిత్రం ‘జై’లో కూడా నటించారు. ప్రాంతీయ సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆ చిత్రంలో నటించానని, ఆ సినిమాకు కూడా మంచి ఆదరణ లభించిందని ఆయన తెలిపారు. తెలుగులో ఆయన గతంలో ‘మోసగాళ్లు’, ‘గని’ వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌లో ‘వెల్‌కమ్ టు ద జంగిల్’, ‘హేరా ఫేరి 3’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే, సౌత్ సినిమాల్లో కేవలం విలన్‌గా చూపించే ట్రెండ్‌ను మార్చాలని ఆయన కోరుతున్నారు.
