Mahesh Babu: ‘లిటిల్ హార్ట్స్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ.. అలా చేయొద్దంటూ స్వీట్ వార్నింగ్
Mahesh Babu: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఈ కోవలోకి చేరిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. కేవలం రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన 10 రోజుల్లోనే రూ.32 కోట్లకు పైగా వసూళ్లు చేసి, చిన్న సినిమాలకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
సినిమా విజయానికి ముగ్దులైన సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, రవితేజ, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నాని, సుమంత్ వంటి అగ్ర హీరోలు ఈ సినిమాపై తమ రివ్యూలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి తన అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేయడంతో చిత్రబృందం ఆనందంలో మునిగిపోయింది.
ఈ సినిమాకు సంగీతం అందించిన యువ సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లి, మహేష్ బాబుకు వీరాభిమాని. ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో సింజిత్, ‘నా దైవం మహేష్ అన్న ఒక్కసారి మా సినిమాపై ట్వీట్ చేస్తే చాలు.. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపోతా. అంతకుమించిన ఆనందం నా జీవితంలో ఉండదు’ అని భావోద్వేగంగా చెప్పాడు. ఈ మాటలు మహేష్ బాబు దృష్టికి వెళ్లడంతో, ఆయన తన అభిమానిని నిరాశపరచకుండా ‘లిటిల్ హార్ట్స్’పై ప్రశంసల వర్షం కురిపించారు.
మహేష్ బాబు తన ట్వీట్‌లో, ‘లిటిల్ హార్ట్స్ చాలా సరదాగా, కొత్తగా, అద్భుతంగా ఉంది. నటీనటులందరూ అసాధారణంగా నటించారు, ముఖ్యంగా యువ నటులు అద్భుతంగా చేశారు’ అని కొనియాడారు. అంతేకాకుండా, సింజిత్‌ను ఉద్దేశిస్తూ, ‘సింజిత్, ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్. నీకు ముందు చాలా బిజీ రోజులు వస్తాయి. కీప్ రాకింగ్’ అని సరదాగా పోస్ట్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా తన పోస్టులో లవ్ ఎమోజీలు, స్మైలీలు జోడించడం అభిమానులను ఆకట్టుకుంది.
https://x.com/urstrulyMahesh/status/1967990956101148977
మహేష్ బాబు ట్వీట్ చూసి సింజిత్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ‘నేను ఎక్కడికీ వెళ్లను మహేష్ అన్నా’ అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు. అంతేకాకుండా, మహేష్ ‘గుంటూరు కారం’ సినిమాలోని డ్యాన్స్‌పై ‘కాత్యాయని’ పాటను ఎడిట్ చేసి ఒక వీడియోను షేర్ చేశాడు. దర్శకుడు సాయి మార్తాండ్ కూడా మహేష్ అభిమాని కావడంతో, ‘సార్, ఇది ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ’ అని ఎమోషనల్ అయ్యారు. చిత్రబృందం మొత్తం మహేష్ బాబు ప్రశంసలకు కృతజ్ఞతలు తెలియజేశారు.