భారత్ తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, గత ఏడునెలలుగా భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. దాని పరిష్కారానికి శుక్రవారం ఇరు దేశాల మధ్య ఎనిమిదో రౌండ్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. .
‘ఏకపక్షవాదం, దుందుడుకు వైఖరి నేపథ్యంలో సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉంది. విభేదాలు వివాదాలుగా మారకూడదని మేం కోరుకుంటాం. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి మేం ప్రాముఖ్యత ఇస్తాం. సరిహద్దులో శాంతియుత పరిస్థితుల కోసం జరిగిన ఒప్పందాలు, ప్రొటోకాల్స్‌ను మేం గౌరవిస్తాం’ అంటూ రాజ్‌నాథ్ భారత్ వైఖరిని వెల్లడిచేశారు. తమది శాంతికాముక దేశమని మరోసారి స్పష్టం చేశారు. యుద్ధాన్ని అరికట్టే సామర్థ్యం ద్వారానే శాంతిని నెలకొల్పగలమన్నారు.
మేలో భారత్, చైనా సరిహద్దులో మొదలైన ఉద్రిక్త వాతావరణం ఇన్నినెలలైనా కొనసాగుతూనే ఉంది. సమస్య పరిష్కారానికి ఇప్పటికే చాలాసార్లు ఇరుదేశాలకు చెందిన దౌత్య, సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. కానీ, పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు.