Tamannaah Bhatia: బరువు తగ్గేందుకు ఇంజెక్షన్లు వాడుతున్నారా?: స్పందించిన తమన్నా
Tamannaah Bhatia: ఇటీవల కాలంలో సినీతారలు తమ శరీరంలో కలిగే మార్పుల వల్ల అనేక రూమర్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ కోవలోనే ప్రముఖ నటి, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బరువు తగ్గడం వెనుక ప్రముఖ డ్రగ్ అయిన ‘ఓజెంపిక్’ ఇంజెక్షన్ల వినియోగం ఉందంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వదంతులు వైరల్ అవుతున్న నేపథ్యంలో, తమన్నా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పష్టత ఇచ్చి, రూమర్స్‌కు ముగింపు పలికారు.
సినీ పరిశ్రమలో నటీనటులు తమ పాత్రల కోసం బరువు పెరగడం, తగ్గడం సర్వసాధారణం. అయితే, తమన్నా విషయంలో మాత్రం వ్యక్తిగత జీవితాన్ని అంటగడుతూ అనవసరమైన ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. తన శరీర ఆకృతిలో మార్పు రావడానికి ఓజెంపిక్ లాంటి ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది.
ఈ వదంతుల గురించి ప్రశ్నించగా తమన్నా ఘాటుగా స్పందించారు. “నా ప్రయాణం పూర్తిగా కెమెరాల మధ్యే సాగింది. నేను దాచడానికి ఏమీ లేదు. కేవలం 15 ఏళ్ల వయసు నుంచే నేను నటనలో ఉన్నాను,” అని ఆమె అన్నారు. “టీనేజ్‌లో నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడూ అలాగే ఉన్నాననే అనుకుంటున్నాను. నాకు నేను కొత్తగా కనిపించడం లేదు,” అని తమన్నా పేర్కొన్నారు.
శరీర ఆకృతిలో మార్పు గురించి మాట్లాడుతూ, ఆమె ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. “సాధారణంగా మహిళల్లో ప్రతి ఐదేళ్లకు జీవక్రియల కారణంగా శారీరక మార్పులు జరుగుతుంటాయి. ఈ కారణంగా ఎవరూ ఎప్పుడూ ఒకే విధమైన శరీర ఆకృతితో కనిపించలేరు,” అని తమన్నా రూమర్స్‌ను కొట్టిపారేశారు. తన శరీరంలో వచ్చిన స్వల్ప మార్పులు సహజమైనవని, వాటికి మెడికల్ ఇంజెక్షన్ల వాడకాన్ని ఆపాదించడం అవాస్తవమని తమన్నా స్పష్టం చేశారు.
ఏళ్లుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న తమన్నా.. కెరీర్‌లో తన ఫిట్‌నెస్, అందం విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని, అనవసరమైన పుకార్లను నమ్మవద్దని ఆమె తన అభిమానులకు పరోక్షంగా సందేశం ఇచ్చారు. ఈ వివరణతోనైనా ఆమెపై వస్తున్న వదంతులకు తెరపడుతుందని భావించవచ్చు.
