Tamannah Bhatia: తమన్నాపై కోపంతో అరిచి, తనను సినిమా నుండి తీసేయాలన్న ఆ స్టార్ హీరో ఎవరు?
Tamannah Bhatia: ప్రముఖ నటి తమన్నా భాటియా ఇటీవల తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమకు చిన్న వయసులోనే రావడంతో ఎదురైన ఇబ్బందులు, ముఖ్యంగా ఒక అగ్ర కథానాయకుడితో జరిగిన సంఘటన గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
సౌత్ స్టార్‌తో చేదు అనుభవం..
కెరీర్ ప్రారంభంలోనే ఒక పెద్ద సౌత్ స్టార్ సినిమాలో అవకాశం వచ్చిందని తమన్నా తెలిపారు. కొన్ని సన్నివేశాలు తనకు అసౌకర్యంగా అనిపించడంతో ఆ విషయాన్ని దర్శకనిర్మాతలకు వివరించారు. దీనిపై ఆగ్రహించిన సదరు స్టార్ హీరో, అందరి ముందు “హీరోయిన్‌ను మార్చండి” అని గట్టిగా అరిచారని, ఆ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని ఆమె వెల్లడించారు. తాను మౌనంగా ఉన్నప్పటికీ, ఆ హీరో మాత్రం కోపంతో అరిచారని చెప్పారు. అయితే, మరుసటి రోజు ఆ హీరో తమన్నా వద్దకు వచ్చి తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పారని, పశ్చాత్తాపపడ్డారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ స్టార్ హీరో పేరు మాత్రం తమన్నా వెల్లడించలేదు. ఈ సంఘటన తమన్నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చాలా మంది ప్రయత్నించారని, కానీ తాను వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నానని తెలిపారు.
బ్యూటీ సీక్రెట్ వివాదం..
తమన్నా తన బ్యూటీ సీక్రెట్స్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. మొటిమలు తగ్గడానికి ఉమ్మి (సలైవా) రాసుకోవాలని ఆమె సూచించారు. ఉమ్మిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయని, అయితే ఇది తన వ్యక్తిగత చిట్కా అని ఆమె పేర్కొన్నారు. తమన్నా చెప్పిన ఈ చిట్కాపై పలువురు చర్మ వైద్య నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోలు చేయడంతో ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిట్కాను పాటించవద్దని వైద్య నిపుణులు హెచ్చరించారు.
తమన్నా జర్నీ ఇలా..
తమన్నా 2005లో హిందీ చిత్రం ‘చాంద్ సా రోష్ చెహ్రా’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో ‘శ్రీ’ సినిమాతో అడుగుపెట్టారు. ‘హ్యాపీడేస్’ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అప్పటి నుంచి తెలుగు, తమిళం, హిందీలో అగ్ర కథానాయకుల సరసన నటించారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
