TDP and Congress Strategy in Telangana Assembly Elections : తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ మూడో తారీఖున విడుదలయ్యె ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఈసారి మళ్లీ ఖచ్చితంగా కేసీఆర్ విజయం సాధిస్తారని బీఆర్ఎస్ వర్గాలు ప్రగాఢ నమ్మకంతో ఉన్నాయి. మరోవైపు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ దె గెలుపు అని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. అయినప్పటికీ బి ఆర్ ఎస్ మాత్రం తామే నెగ్గుతామని గట్టిగా చెబుతుంది.
అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ ఓటు షేర్లు పెంచుకోవడానికి, టిడిపి కూడా ఒక కారణమనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే అది నిజమే అని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పడం గమనార్హం. ఈసారి తెలంగాణ ఎన్నికలను మొదట టిడిపి ప్రధానంగా తీసుకుంది. కానీ ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా పోటీ నుండి తప్పుకుంది. తెలంగాణలో టిడిపికి కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఓటింగ్ ఉంది.
ముఖ్యంగా మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో టిడిపికి మంచి మద్దతు, ఓట్ల సంఖ్య కూడా ఉంది. కానీ టిడిపి ఎన్నికల నుండి తప్పుకోవడం, ఆ జిల్లాలోని టీడీపీ సానుభూతిపరులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం. ఇప్పుడు ప్రధానంగా టిడిపి ,కాంగ్రెస్ కి కావాలనే సపోర్ట్ చేసిందనే వాదనను బలపరుస్తున్నాయి. దీని వెనుక మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అలాగే కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
అలాగే తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క వంటి వారు సైతం పరోక్షంగా టిడిపికి మద్దతు పలుకుతున్న నేతలు. దాంతో టిడిపి ఓటర్లంతా కాంగ్రెస్ వైపే తమ మద్దతును తెలిపినట్టు విశ్లేషకులు అంచనా వేశారు. ఇక చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా కేసీఆర్ స్పందించిన తీరు టిడిపి ఓటర్లను కాంగ్రెస్ కు దగ్గర చేసిందని చెప్పవచ్చు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ధర్నాలకు, నిరసనలకు కేసీఆర్ అనుమతి ఇవ్వలేదు. ఆ సందర్భంలో టిడిపిని కేసీఆర్ వ్యతిరేకించడం లాంటి పనులు కూడా చేశారు.
ఇవన్నీ గమనించే టిడిపి నేతలు ,అభిమానులు కాంగ్రెస్ కి మద్దతు తెలిపారని అర్థమవుతుంది. ఈ రకంగా చూసుకుంటే టిడిపి, కాంగ్రెస్ కి పూర్తి మద్దతు తెలిపిన విషయం, అలాగే ఈరోజు కాంగ్రెస్ గెలుపుకు టిడిపి కూడా ఒక కారణం అనే విషయం అర్థమవుతుంది.