Manchu Manoj: ‘మిరాయ్’.. నాకు దేవుడు ఇచ్చిన వరం: మంచు మనోజ్
Manchu Manoj: యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మిరాయ్’ ట్రైలర్ విడుదల వేడుకలో సినిమా యూనిట్ సభ్యులు భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో తేజ, విలన్ మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తేజ సజ్జా మాట్లాడుతూ, “నేను పాన్ ఇండియా హీరోని కాదు. నేను మన తెలుగు ప్రేక్షకుల కోసం, వారి మెప్పు కోసమే సినిమాలు చేస్తున్నాను. నా సినిమా ఇతర భాషల వారికి కూడా నచ్చితే అది నాకు లభించే బోనస్. నేను పుట్టింది, పెరిగింది ఇక్కడే, నా ప్రెస్ మీట్‌లు కూడా మీతోనే. ఈ సినిమాలో మంచు మనోజ్ గారి పాత్ర చూస్తే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయం” అని అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ, “మిరాయ్ వెనుక చాలా కలలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం ఈ ప్రయాణం ప్రారంభమైంది. నాకు ఈ సినిమాలో అవకాశం రావడం దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. నా కెరీర్‌లో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదు. ‘హనుమాన్’ వంటి భారీ విజయం తర్వాత వెంటనే సినిమాలు చేసి డబ్బు సంపాదించుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కానీ, తేజ ‘మిరాయ్’ కోసం మరో ప్రాజెక్ట్ అంగీకరించకుండా మూడేళ్లు వేచి చూశాడు. సినిమా గురించి నాకు కొంచెమే తెలుసని కార్తీక్ ఘట్టమనేనిని కలిశాక అర్థమైంది. ఆరేళ్ల క్రితం ఆయన ఈ కథ రాశారు. అశోకుడు రాసిన 9 పుస్తకాల గురించి ప్రపంచానికి తెలియజేయాలన్న సంకల్పంతో ఈ సినిమా రూపొందించారు. రాజాసాబ్ చిత్రానికి ఎంత ఖర్చు చేస్తున్నారో, మా మిరాయ్ చిత్రానికి కూడా అంతే చేస్తున్నారు నిర్మాత విశ్వప్రసాద్ గారు. ఇలాంటి నిర్మాతను నేను ఇప్పటివరకు చూడలేదు” అని మనోజ్ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటి శ్రియ మాట్లాడుతూ, సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు. ఈ సినిమా కోసం వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్‌ను ఒక సవాలుగా తీసుకున్నామని నిర్మాత విశ్వప్రసాద్ పేర్కొన్నారు.