Teja Sajja: ఆ స్టార్ డైరెక్టర్ నన్ను మోసం చేశారు: తేజ సజ్జా సంచలన వ్యాఖ్యలు
Teja Sajja: ‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా, తన తాజా చిత్రం ‘మిరాయ్’ విడుదల సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, తిరస్కరణలు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మద్దతు గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి ప్రోత్సాహంతోనే తొలి అడుగు
తన జీవితంలో చిరంజీవి స్థానం చాలా ప్రత్యేకమైనదని తేజ సజ్జా అన్నారు. “చిరంజీవి గారు నన్ను సొంత పిల్లాడిలా చూసుకున్నారు. ‘చూడాలని ఉంది’ సినిమాకు బాల నటుల కోసం వందల ఫొటోలు రాగా, వాటిలో నుంచి ఆయన నన్ను ఎంపిక చేశారు. ఆ రోజు ఆయన నా ఫొటోను సెలెక్ట్ చేయకపోయి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. అలా నా కెరీర్ ప్రారంభమైంది” అని తేజ భావోద్వేగంగా చెప్పారు. ‘హనుమాన్’ చూసిన తర్వాత కూడా చిరంజీవి గారు 20 నిమిషాలు మాట్లాడి, భవిష్యత్తులో ఎలా ఉండాలో విలువైన సలహాలు ఇచ్చారని తెలిపారు. అలాగే, నటి సమంత కూడా ‘ఓ బేబీ’ సినిమా సమయంలో తనకు చాలా సహాయం చేశారని, తన గురించి అందరికీ తెలియాలని ప్రమోషన్స్‌లో భాగంగా తనను పంపేవారని గుర్తు చేసుకున్నారు.
నమ్మించి మోసం చేసిన స్టార్ డైరెక్టర్
హీరోగా తన ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను కూడా తేజ సజ్జా వెల్లడించారు. “హీరోగా అవకాశాల కోసం నేను చాలా కష్టాలు పడ్డాను. ఎన్నో అవమానాలు, తిరస్కరణలు చూశాను. నన్ను మోసం చేసిన వారిలో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు” అని అన్నారు. ఒక స్టార్ దర్శకుడు తనకు కథ చెప్పి షూటింగ్ కూడా ప్రారంభించారని, అయితే 15 రోజుల తర్వాత ఆ సెట్స్‌కు మరో హీరో వచ్చి, తానే ఆ సినిమా హీరో అని చెప్పడంతో షాక్ అయ్యానని తేజ తెలిపారు. తనతో కేవలం మాక్ షూట్ చేసి, ఆ సీన్లను మరో హీరోకి చూపించారని తెలిసి చాలా బాధపడ్డానని చెప్పారు. ఈ అనుభవాలన్నీ తనను మరింత బలపరిచాయని తేజ ధీమాగా చెప్పారు.