Telangana Cabinet Meeting:నేడు తెలంగాణా మంత్రిమండలి సమావేశం… చర్చకి రానున్న కీలక అంశాలు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రగతి భవన్ లో జరగనుంది. అయితే ఈ సమావేశం లో పలు కీలక అంశాలు చర్చకి వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ లుగా ఎంపిక చేయాల్సిన ఇద్దరిని ఖరారు చేయడంతో పాటు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న కీలక బిల్లులపైనా మాట్లాడుకోనున్నారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకి ఈఢీ అధికారులు నోటీసులు ఇచ్చిన అంశం పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈఢీ విచారణ సందర్బంగా ఒకవేళ కవితని అరెస్ట్ చేస్తే ఎలా స్పందించాలన్న విషయం పై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రం పై వ్యవహరిస్తున్న కక్ష సాధింపు చర్యలపై మున్ముందు భవిష్యత్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అని కూడా చర్చ చేయనున్నారు.
వాటితో పాటు పేదలకి ఇళ్ల స్థలాల పంపిణీ, స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 3 లక్షల చొప్పున నిధులపై, మూడు పారిశ్రామిక వాడల్లోని భూముల క్రమబద్దీకరణ అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో అమలు అవుతున్న కంటి వెలుగు కార్యక్రమం, మంగళవారం ప్రారంభం అయిన “మహిళా ఆరోగ్య”కార్యక్రమం తో పాటు ప్రధానంగా విధ్యుత్ ఉద్యోగుల PRC అంశంపై ఈరోజు కేబినెట్ లో సమీక్షించే అవకాశం ఉంది.