Sukumar Daughter: జాతీయ అవార్డు గెలుచుకున్న సుకుమార్ కుమార్తెను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Sukumar Daughter: ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుటుంబం, ప్రముఖ నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఉత్తమ బాలనటిగా ఎంపికైన సుకుమార్ కుమార్తె సుకృతి వేణిని సీఎం ప్రత్యేకంగా సత్కరించి, అభినందించారు.
గాంధీ తాత చెట్టు అనే సినిమాలో అద్భుతమైన నటనకు గాను సుకృతి వేణికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమా, థియేటర్లలో విడుదల కాకముందే పలు అంతర్జాతీయ సినీ వేడుకల్లో ప్రదర్శితమై అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా, సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు.
‘గాంధీ తాత చెట్టు’ సినిమా కథ విషయానికొస్తే, ఇది నిజామాబాద్ జిల్లాలోని అడ్లూర్ అనే గ్రామంలో జరిగే కథ. గాంధీ మహాత్ముని సిద్ధాంతాలను నమ్మి పెరిగిన రామచంద్రయ్య అనే వృద్ధుడు, తన మనవరాలికి ‘గాంధీ’ అని పేరు పెట్టి అదే సిద్ధాంతాలను ఆమెకు బోధిస్తాడు. రామచంద్రయ్య తన పొలంలోని చెట్టును ప్రాణంగా భావిస్తుంటాడు. ఊరిలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల వల్ల ఆ చెట్టుకు ముప్పు వాటిల్లుతుంది. ఆ సమయంలో, చిన్నారి గాంధీ తన తాత బోధించిన మార్గంలో శాంతియుతంగా చేసే పోరాటమే ఈ సినిమా.
సాధారణంగా దర్శకుడు సుకుమార్ అంటే ‘పుష్ప’ లాంటి కమర్షియల్ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే, అందుకు పూర్తిగా భిన్నమైన కథాంశంతో, ఒక చెట్టుకు కూడా ప్రాణం ఉంటుందని చెప్పే గొప్ప సందేశాత్మక చిత్రాన్ని ఆయన కుటుంబం నిర్మించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం నెమ్మదిగా సాగే కథనం కలిగి ఉన్నప్పటికీ, సుకృతి వేణి నటన ప్రేక్షకులను హత్తుకునేలా ఉందని విమర్శకులు ప్రశంసించారు.
సుకుమార్ తనయ సుకృతి వేణి… సినిమాకి కీలకమైన గాంధీ పాత్రకి ప్రాణం పోశారు. స్వచ్ఛత, అమాయకత్వం సుకృతివేణి నటనలో పక్కాగా కనిపించాయి. పాత్ర కోసం నిజంగానే గుండు చేయించుకుని నటించింది. తెలంగాణ యాసలో సంభాషణలు పలికిన తీరు బాగుంది.
