వాయుగుండం ప్రభావంతో చిగురుటాకులా వణుకుతున్న హైదరాబాద్ నగరవాసులకు ఉపశమనం కలిగించే వార్త. తెలంగాణకు వాయుగుండం ముప్పు తప్పిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే 12 నుండి 18 గంటలలో అది బలహీనపడుతుందని ప్రకటించింది. వాయుగుండం ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా సమీపంలో కొనసాగుతుందని అతి భారీ వర్షాలు తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో భాగ్య నగర జీవులు నగరం కాదిది నరకం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
అడుగు జాగా ఖాళీ లేకుండా అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణం ఆఖరికి చెరువులు, కాలువలు కాదేదీ కబ్జాకి అనర్హం అనే రీతిలో ప్రతి సెంటీమీటర్ ని లెక్క చూస్తూ వదలకుండా నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ గోడల మధ్య జీవిస్తున్న నగర జీవి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిగురుటాకులా వణికిపోయాడు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవితంలో ఎన్నడూ చూడని జల విలయాన్ని చూస్తూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది.