The Bads of Bollywood: మరో వివాదంలో ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్.. నార్కోటిక్స్ అధికారి వాంఖడే పరువు నష్టం
The Bads of Bollywood: బాలీవుడ్ ప్రముఖుల జీవితాలపై రూపొందించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ విడుదలైంది మొదలు వివాదాల్లోనే ఉంది. ఇటీవల ఈ-సిగరెట్ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రణ్‌బీర్ కపూర్, నెట్‌ఫ్లిక్స్ సహా నిర్మాణ సంస్థలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చట్టపరమైన చర్యలకు ఉపక్రమించనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదాల పరంపరలో ఈ సిరీస్‌కు తాజాగా మరో చిక్కు వచ్చిపడింది. ఈ సిరీస్‌లో తనను తప్పుగా చూపించారంటూ మాజీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్‌పై ఆయన పరువు నష్టం దావా వేశారు.
2 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ..
తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు గాను 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వాంఖడే పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నష్టపరిహారాన్ని టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని ఆయన దావాలో తెలిపారు. ఈ సిరీస్ మాదకద్రవ్యాల నిరోధక సంస్థలను తప్పుదారి పట్టించేలా చూపిస్తోందని, దీని వల్ల ప్రజల్లో చట్టాన్ని అమలు చేసే సంస్థలపై నమ్మకం దెబ్బతింటుందని వాంఖడే తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సిరీస్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారినని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని, పలు చట్టాలను అతిక్రమించి, వాటిని అగౌరవపరిచారని ఆరోపించారు. గతంలో క్రూజ్ నౌకలో డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను సమీర్ వాంఖడే బృందం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
అయితే, సమీర్ వాంఖడే వేసిన పరువు నష్టం దావాను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పిటిషన్‌లోని కొన్ని అంశాలు స్పష్టంగా లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. “ప్రస్తుత ఫార్మాట్‌లో మీ పిటిషన్‌ను విచారించలేం. మేము దీన్ని తిరస్కరిస్తున్నాం. ఒకవేళ ఢిల్లీ నుంచే మీకు ఎక్కువ నష్టం కలిగిందని భావిస్తే, దానికి అనుగుణంగా పిటిషన్‌ను సవరించి మళ్లీ దాఖలు చేయవచ్చు” అని న్యాయస్థానం వాంఖడే తరపు న్యాయవాదికి సూచించింది.