కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని అతనికి ఛలాన్ వేశారు. ఆ ఛలాన్‌లో “కారు” అని స్పష్టంగా తెలిపారు. డ్రైవింగ్ చేసే వ్యక్తి హెల్మెట్ ధరించనందున ఫైన్ వేస్తున్నట్లు తెలిపారు. అవాక్కైన ఆ డ్రైవర్.. ఇంత ఘోరమా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఛలాన్ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది.
దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరును తప్పుపడుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రోడ్లపై గతుకులను తొలగించరు గానీ.. అర్థం పర్థం లేని ఛలాన్లు మాత్రం వేస్తారని ఫైర్ అవుతున్నారు. ఈ ఛలాన్‌పై బాధితుడు ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని తెలిపారు. ఛలాన్ రద్దు చేశారు. పొరపాటున జరిగినా.. నెటిజన్లు మాత్రం పోలీసుల్ని ఆడేసుకుంటున్నారు.
దేశంలో మిగతా రాష్ట్రాల్లో ట్రాఫిక్ పోలీసుల తీరు ఎలా ఉన్నా.. కర్ణాటకలో పోలీసులు మాత్రం కాస్త కఠినంగా వ్యవహరిస్తారు. రూల్స్ పాటించని వారికి కచ్చితంగా ఫైన్లు వేస్తున్నారు. బైక్‌పై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకునేలా చేస్తున్నారు. ఇద్దరు వెళ్తే.. ఇద్దరికీ హెల్మెట్ ఉండాలని రూల్ పెట్టారు. ఇద్దరికీ హెల్మెట్ లేకపోతే.. రైడర్‌కి ఫైన్ వేస్తారు. అందుకే కర్ణాటకలో బైక్ నడిపేవారు.. అదనపు హెల్మెట్ లేకపోతే.. లిఫ్ట్ ఇవ్వరు. ఇంత కఠినంగా వ్యవహిస్తారు కాబట్టే.. టెక్నికల్‌గా జరిగిన తప్పుపై నెటిజన్లు ఈ రకంగా సెటైర్లు వేస్తున్నారు.