The Family Man 3: OTTలోకి ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
The Family Man 3: ఓటీటీ వేదికలపై తిరుగులేని ఆధిపత్యం చాటుకుంటున్న నటుడు మనోజ్ బాజ్‌పేయి, రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఆయనకు దేశవ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చిపెట్టిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్, అలాగే మరో థ్రిల్లర్ సినిమా ‘ఇన్‌స్పెక్టర్ జెండే’ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు అభిమానుల అంచనాలను భారీగా పెంచుతున్నాయి.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వచ్చేది అప్పుడే!
రాజ్ & డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్టయ్యాయి. స్పై థ్రిల్లర్, కుటుంబ అనుబంధాల కలయికతో శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ బాజ్‌పేయి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మూడో సీజన్‌లో ఇండియా-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీకాంత్ తివారి మిషన్ కొనసాగనున్నట్లు సమాచారం. ఈ సీజన్ అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
‘ఇన్‌స్పెక్టర్ జెండే’గా మనోజ్ బాజ్‌పేయి
‘ఇన్‌స్పెక్టర్ జెండే’ అనే మరో థ్రిల్లర్ చిత్రంలో కూడా మనోజ్ బాజ్‌పేయి కనిపించనున్నారు. ఈ సినిమా 1970, 80 దశకాల్లో ముంబైలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ‘స్విమ్‌సూట్ కిల్లర్’ అని పిలువబడే ఒక నేరస్థుడిని పట్టుకోవాలనే లక్ష్యంతో ఉన్న పోలీసు అధికారి పాత్రలో మనోజ్ బాజ్‌పేయి నటించనున్నారు. జిమ్ సర్భ్ ఆ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ థ్రిల్లర్ సినిమా సెప్టెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రెండు ప్రాజెక్టులతో మనోజ్ బాజ్‌పేయి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.