National Award Controversy: ‘ది కేరళ స్టోరీ’కి జాతీయ అవార్డు.. భగ్గుమన్న ప్రతిపక్షాలు.. తీవ్ర స్థాయిలో విమర్శలు
National Award Controversy: గతేడాది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’కి జాతీయ పురస్కారాలు ప్రకటించడం కేరళలో రాజకీయ దుమారాన్ని రేపింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు లభించాయి. అయితే, ఈ నిర్ణయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు ప్రతిపక్షాలు సైతం ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇది కేరళ రాష్ట్రాన్ని అవమానించడమేనని, విద్వేషపూరిత ప్రచారానికి పట్టం కట్టడమేనని వారు ఆరోపిస్తున్నారు.
‘ఫిల్మ్ జ్యూరీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఫాలో అవుతోంది’
ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. కేరళ ప్రతిష్టను దెబ్బతీసి, మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన చిత్రానికి అవార్డులు ఇవ్వడం ద్వారా, కేంద్రంలోని ప్రభుత్వం సంఘ్ పరివార్ భావజాలాన్ని చట్టబద్ధత కల్పిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామరస్యానికి, ప్రతిఘటనకు నిలయమైన కేరళను ఈ నిర్ణయం తీవ్రంగా అవమానించిందని ఆయన అన్నారు. ఇది కేవలం మలయాళీలకే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను విశ్వసించే ప్రతి ఒక్కరికీ జరిగిన అవమానమని, దీనిపై అందరూ గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
https://x.com/pinarayivijayan/status/1951306656807342553
https://x.com/kcvenugopalmp/status/1951328359843315797
‘ది కేరళ స్టోరీ’ చెత్తబుట్టలో పడేయాల్సిన సినిమా’
ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఆలప్పుజ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఘాటుగా స్పందించారు. “ఆ చిత్రాన్ని చెత్తబుట్టలో పడేయాలి. అది ఒక కుళ్ళిపోయిన ఎజెండాను ప్రచారం చేస్తోంది,” అని ఆయన విమర్శించారు. అందమైన కేరళ రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసిన ఈ సినిమాకు జాతీయ పురస్కారం రావడం, బీజేపీ ప్రభుత్వం ద్వేషాన్ని ఎలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి ఒక ఉదాహరణ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ, సౌభ్రాతృత్వంతో జీవించే కేరళ ప్రజలు ఈ అవమానాన్ని సహించరని, బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
