Ranbir Kapoor: ఈ-సిగెరెట్ల వ్యవహారంలో రణబీర్ కపూర్‌పై చర్యలు తీసుకోండి: మానవహక్కుల కమిషన్
Ranbir Kapoor: బాలీవుడ్ అగ్ర నటుడు రణ్‌బీర్ కపూర్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. భారత ప్రభుత్వం నిషేధించిన ఎలక్ట్రానిక్ సిగరెట్‌ను వెబ్‌సిరీస్‌లో వినియోగించినందుకు గానూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ముంబై పోలీసులను ఆదేశించింది. యువతపై తప్పుడు ప్రభావం చూపే ఇలాంటి దృశ్యాలను ప్రదర్శించకూడదని సూచించింది.
షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్‌సిరీస్‌లో రణ్‌బీర్ అతిథి పాత్రలో నటించారు. ఈ సిరీస్‌లో భాగంగా ఆయన ఎలక్ట్రానిక్ సిగరెట్‌ను ఉపయోగిస్తూ కనిపించడంతో వివాదం మొదలైంది. భారత్‌లో 2019లోనే ఎలక్ట్రానిక్ సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, విక్రయాలు, దిగుమతి, వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వెబ్‌సిరీస్‌లో ఇ-సిగరెట్ వినియోగించడాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్పందించిన కమిషన్, రణ్‌బీర్‌తో పాటు ఈ సిరీస్‌కు సంబంధించిన నిర్మాతలు, అలాగే నెట్‌ఫ్లిక్స్‌పై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది.
ఇంతేకాకుండా, యువతను తప్పుదోవ పట్టించే కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమైన ఈ సిరీస్‌లో లక్ష్య, బాబీ దేవోల్, సహేర్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్లతో పాటు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కూడా అతిథి పాత్రల్లో కనిపించడం ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ఇప్పుడు ఈ వివాదంతో వార్తల్లో నిలిచింది.
