అంతర్వేది లక్ష్మీ నరసింహ ఆలయానికి నూతన రథం నిర్మించి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం నిర్మాణంలో అగ్నికులక్షత్రియులకు ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతర్వేది ఆలయ సాంప్రదాయాలు స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని అంతర్వేది రధం నిర్మాణం జరగాలని సూచించారు. ఆయన లేఖ లో వివిధ అంశాలను ప్రస్తావించారు. అంతర్వేది లక్ష్మీ నారసింహుడిని అగ్ని కులక్షత్రియులు తమ కుల దేవంగా పూజిస్తారు, ఆలయాన్ని అగ్నికుల క్షత్రియుడైన కోపనాతి కృష్ణమ్మ గారు నిర్మించిన సంగతి యావన్మందికి విధితమే. తొలి రథం కూడా కృష్ణమ్మ రూపొందించినదే, అయితే ఆ రధం శిథిలావస్థకు చేరిన క్రమంలో ఆ స్థానంలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన రథం కూడా స్థానిక అగ్నికుల క్షత్రియులు తయారుచేసిందే. ఇప్పుడు కొత్తగా నిర్మాణం లో తమకు ప్రాధాన్యత లేకపోవడం పై అగ్నికుల క్షత్రియ సంఘం వారు ఆవేదన చెందుతూ నాకు ఒక లేఖ రాశారు. లేఖలో వారు పేర్కొన్న అంశాలు సహేతుకంగా ఉన్నాయి. రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రియులకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం. అదేవిధంగా.. ఈ రథం తయారీని వేరే రాష్ట్రంలో ఉన్న వారికి అప్పగించారని, అయితే అంతకన్నా తక్కువ మొత్తానికి రధాన్ని రూపొందించ కలిగినవారు తమ లో ఉన్నారని అందువల్ల ఆ బాధ్యతలు తమకే అప్పగించాలని వారు కోరుతున్నారు. అందువల్ల వారి ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని లేఖలో పేర్కొన్నారు.
ఆలయ సంప్రదాయాలు ఆలయం తో ముడిపడి ఉన్న వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అగ్నికుల క్షత్రియ సంఘం తో చర్చించి వారి ఇలవేల్పు అయిన లక్ష్మీనారసింహునికి సంబంధించిన నూతన రథం రూపకల్పనలో వారిని భాగస్వామ్యులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రథోత్సవం నాడు కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగే అగ్నికుల క్షత్రియులే అయినందున వారి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పవన్ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు.