Mammootty: మమ్ముట్టి పేరు వెనుక ఇంత కథ ఉందా? కాలేజీలో సరదా సంఘటనతో పేరు మార్చిన స్నేహితుడు
Mammootty: మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా మెగాస్టార్‌గా వెలుగొందుతున్న నటుడు మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టీ అన్న విషయం ఆయన అభిమానులకు తెలిసిందే. అయితే మహమ్మద్ కుట్టీ కాస్తా మమ్ముట్టిగా ఎలా మారింది? ఆ పేరు వెనుక దాగి ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటనే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన చిన్ననాటి స్నేహితుడిని పరిచయం చేస్తూ, కాలేజీ రోజుల్లో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని పంచుకున్నారు.
“నేను కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడు, నా స్నేహితులు, తోటి విద్యార్థులందరితో నా పేరు ప్రముఖ నటుడు ఒమర్ షరీఫ్ అని చెప్పేవాడిని. అప్పట్లో నా అసలు పేరు మహమ్మద్ కుట్టీ అని కాలేజీలో ఎవరికీ తెలియదు,” అని మమ్ముట్టి నవ్వుతూ చెప్పడం ప్రారంభించారు.
అయితే ఒక రోజు అనుకోకుండా నా ఐడీ కార్డు మర్చిపోయి పట్టుబడ్డాను. దాంతో నా అసలు పేరు అందరికీ తెలిసిపోయింది. “నా స్నేహితుల్లో ఒకరు ఐడీ కార్డును చూసి, ‘నీ పేరు షరీఫ్ కాదు మమ్ముట్టి’ అని గట్టిగా అన్నారు,” అని ఆయన నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.
నిజానికి ఐడీ కార్డులో మహమ్మద్ కుట్టీ అని ఉన్నప్పటికీ, ఆ స్నేహితుడు పొరపాటుగా ఆ పేరును ‘మమ్ముట్టి’ అని చదివాడు. “ఒక పొరపాటుగా చదివిన ఆ పేరే ఆ తర్వాత నా నిజమైన పేరుగా మారిపోయిందని,” మెగాస్టార్ మమ్ముట్టి చెప్పుకొచ్చారు. కాలేజీలో జరిగిన ఆ చిన్న సరదా సంఘటనే తన వృత్తి జీవితంలో స్థిరపడిపోయి, నేడు తానొక మెగాస్టార్ మమ్ముట్టిగా అందరికీ సుపరిచితం కావడానికి కారణమైందని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా తన సినీ పేరు మార్పుకు పరోక్షంగా కారణమైన ఆ కాలేజీ స్నేహితుడి పేరు శశిధరన్ అని చెప్పి, ఆయన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. మమ్ముట్టి తన విజయ రహస్యం వెనుక ఉన్న ఈ చిన్న సరదా కథను పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
