పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం కొద్దిసేపటి క్రితం విశాఖ నర్సాపురం మధ్య తీరాన్ని తాకింది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన వాయుగుండం పూర్తిగా తీరాన్ని దాటడానికి మరి కొంత సమయం పడుతుంది అని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర ,ఉభయగోదావరి, కృష్ణ జిల్లాల్లో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మరో 72 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంత గ్రామ ప్రజలను, అధికారులను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.
కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల పైగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యంలో మారేడుమిల్లి- చింతూరు రహదారిలో విరిగి పడుతున్న చెట్లు కారణంగా రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు.