ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలకు భూములిచ్చిన రైతులకు పరిస్థితి అగమ్యగోచరమే.. ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రభుత్వాలు నిర్వాసితులకు పరిహారం విషయంలో ప్రతిసారి తన అధికారాన్ని ఉపయోగించి వారి నోరు మూయించే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప న్యాయం చేయడం లేదు.
తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్తులు వరద నీటిలో గడుపుతూ తమను కాపాడమని చేసిన విజ్ఞప్తిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తక్షణమే వారిని కాపాడడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
తమ కాలనీలోకి రిజర్వాయర్ నీరు వస్తుందని, తమను కాపాడాలని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు చేసిన విజ్ఞప్తిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన ఈ విషయంపై స్థానిక నాయకులను క్షేత్రస్థాయికి పరిశీలనకు పంపారు. స్థానిక నాయకుల నివేదిక అనంతరం పవన్ కళ్యాణ్ ఈ విషయం పై స్పందిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. కాలనీ వాసుల పరిస్థితి దయనీయంగా ఉందని, వారికి పరిహారం అందని కారణంగా వారు అక్కడే నివాసం ఉంటున్నారని, వేరే చోట నివాసం ఏర్పరచుకునే స్తోమత వారికి లేదని, వృద్ధులు మహిళలు చిన్నపిల్లలతో ముంచుకొస్తున్న వరదనీటి మధ్యన భయం భయం గా గడుపుతున్నారని అయన లేఖలో పేర్కొన్నారు.
రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం లో నీరు విడుదల చేస్తే వారి ప్రాణాలకే ప్రమాదం అని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తాళ్ల పొద్దుటూరు నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అధికారులు నిర్వాసితులతో తక్షణం సంప్రదింపులు జరిపి తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.