వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడితే భయపడే సమస్యే లేదు. మీరు అక్రమంగా కేసులు పెడతారని తెలుసు. మేము దానికి సిద్ధమయ్యే ఉన్నాం. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, స్టేషన్ కు పిలిపించి కొట్టడం, దాన్ని ప్రశ్నిస్తే మా పై కేసులు పెడతారా? అంటూ గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు ప్రశ్నించారు. నియోజకవర్గంలో పోలీసుల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా కార్యకర్తలు పోలీసుల నుండి ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు.
నేను రెంటచింతలలో కార్యకర్తలు చెప్పిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం జరిగింది. దాంట్లో పోలీసులపై ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదు. రెంటచింతలలో బీసీ నాయకుడు శరవయ్య చనిపోతే వాళ్ళ పిల్లల్ని పిలిచి మీరు కర్మకాండలు చేయటానికి వీలు లేదని చెప్పడం దుర్మార్గమైన విషయం కాదా? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే కర్మకాండ చేసుకోరా? దానినే మేము నిన్న ప్రశ్నించడం జరిగింది రెంటచింతలలో.
మీరు కేసులు పెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ కూడా లేరు, నేను మాచర్ల నియోజకవర్గంలో పని చేస్తున్న పోలీసులకు ఒకటే చెబుతున్నాను, మీరుకూడా మా ప్రభుత్వంలో మాచర్ల నియోజకవర్గంలో ఎక్కువ మంది పని చేసిన వాళ్లే, నాతో కూడా పని చేయించుకున్న వాళ్లే, మా ప్రభుత్వంలో ఎటువంటి అరాచకాలు చెయ్యమని మేము చెప్పలేదు. అది మీ మనస్సాక్షికి తెలుసు. కానీ మీరు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి.
దుర్గి మండలంలో ఆత్మకూరులో దళితులను గ్రామం నుండి వెళ్ళగొట్టారు. జంగమేశ్వరపాడులో ఇష్టారాజ్యంగా పిలిచి కొడతా ఉన్నారు. తేరాలలో పిలిచి కొట్టి కేసులు పెడుతున్నారు. ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తున్నారు. మీరు ఈరోజు చట్టవ్యతిరేకంగా చేసే అన్ని పనులు మేము రేపు వాటిని చట్టబద్ధంగా చేస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఈరోజు మీ చేతుల్లో ఇబ్బందులు పడిన వాళ్లందరి దగ్గర కంప్లైంట్లు తీసుకుని చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
నేను మిమ్మల్ని కోరేది తాత్కాలికమైన పోస్టింగ్ ల కోసం భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా గౌరవం. 30 సంవత్సరాలుగా ఆ డిపార్ట్మెంట్ ని నేను ఎంతో అభిమానిస్తాను. కానీ ఈరోజు మాచర్ల నియోజకవర్గంలోని ఎవరైతే మీతోని అకృత్యాలు చేపిస్తున్నారో, రేపు ప్రభుత్వం మారిన తరువాత వాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు. ఉద్యోగాలు పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రేపు మీతో పాటు మీ కుటుంబం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయి. కుటుంబాన్ని కూడా ఆలోచించుకుని మీరు ఉద్యోగాలు చేయాలని కోరుతున్నాను.
ఈ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లడం ఖాయం. ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీకు ఇంకా చాలా సర్వీసు ఉంది. అవన్నీ మర్చిపోయి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి.
వైసీపీ నాయకుల అక్రమాలకు, అకృత్యాలకు మీరు వంత పాడితే ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కోవలసింది మీరే. పోలీస్ స్టేషన్ కు పిలిపించడం, మీరు తెలుగుదేశం పార్టీలో తిరగడానికి వీలు లేదు. మీరు పార్టీ మారాలి. మీరు వైసీపీ కండువా వేసుకోవాలి. వినకపోతే అసభ్యకరమైన పదజాలంతో బూటు కాళ్లతో తన్ని కాళ్ళు, చేతులు విరిగేటట్లు కొట్టడం ఎంతవరకు సమంజసం? మీకు ఆ అధికారం ఎవరిచ్చారు? మీరు చట్టవ్యతిరేకంగా పని చేసినప్పుడు మీ మీద ప్రైవేట్ కేసులు ఎందుకు వెయ్యకూడదు? ఈరోజు మా మీద ఒక కేసు పెడితే రేపు మీ మీద వంద కేసులు పెడతాం.
నేను మాచర్ల నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఒకటే చెబుతున్నాను, ఈ తాత్కాలికమైన ఇబ్బందులను మనం తప్పకుండా అధిగమిస్తాం. ధైర్యంగా ఉండండి మనోధైర్యం కోల్పోవద్దు, వాళ్ళు చేసే ఆకృత్యాలు, అక్రమాలు, అన్యాయాలు తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తాం, ఇటువంటి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలంటే బెదిరేది లేదు, అదిరేది లేదు, భయపడేది లేదు, అది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన పోలీసుల పనితీరును ఆక్షేపించారు.