భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ వరద బాధితులకు బాసటగా తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు, సాంకేతిక నిపుణులు తమ వంతు సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తులు ఎదురైన ప్రతిసారి బాధితులకు అండగా నిలుస్తూ వచ్చిన చిత్ర సీమ లోని హీరోలు ఈసారి కూడా తమ పెద్ద మనసు చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి, నిరాశ్రయులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. హీరో నాగార్జున బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలతో ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయని, ఇది ఎంతో ఆవేదన కలిగించే అంశమని ఆయన అన్నారు.
అలాగే హీరో మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ భారీ వర్షాల కారణంగా ఏర్పడిన జల విలయానికి ఎంతో మంది జీవితాలు చిథ్రం అయ్యానని, వారి కష్టాన్ని చూస్తుంటే ఎంతో ఆవేదన కలిగిస్తుందని నగరజీవి నిలువ నీడ లేక నిరాశ్రయులయ్యారని ఈ సమయంలో బాధితుల కోసం నా వంతు సాయంగా ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు విరాళంగా అందజేస్తానని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
హీరో మహేష్ బాబు తెలంగాణ లో భారీ వర్షం వలన సంభవించిన ఈ ప్రకృతి వినాశనం మునుపెన్నడూ ఊహించనిది, బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తన వంతుగా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో వెల్లడించారు.
హీరో ప్రభాస్ బాధితుల సహాయార్థం 1 కోటి 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. హీరో ఎన్టీఆర్ మనమంతా కలిసి హైదరాబాద్ ను తిరిగి నిర్మించుకుందాం.. బాధితులకు అండగా ఉందామని పిలుపునిస్తూ 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. హీరో రవితేజ 10 లక్షలు, రామ్ పోతినేని 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు విరాళంగా ప్రకటించి బాధితులకు అండగా నిలిచారు.
సాంకేతిక నిపుణుల్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, దర్శకుడు హరీష్ శంకర్ 5 లక్షలు, అనిల్ రావిపూడి 5లక్షలు విరాళంగా ప్రకటించారు. నిర్మాత బండ్ల గణేష్ వరద బాధితుల కోసం వెయ్యి కేజీల బియ్యం తో పాటు 500 దుప్పట్లు అందజేస్తున్నట్లు ప్రకటించారు.
ఈరోజు మరింతమంది విరాళాలు ప్రకటించే అవకాశం ఉంది. తమకు అండగా నిలిచే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చిత్రపరిశ్రమ బాసటగా నిలవడం అభినందించదగ్గ విషయం.